Business

సౌదీ అరామ్‌కో లాభాలు ఢమాల్-వాణిజ్యం

Business News - Saudi Aramco Profits Lost By 50Percent

* జనవరిలో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 13.36 లక్షల మంది నికర చందాదారులు చేరారు. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 27.79 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబరుతో పోల్చినా 24 శాతం మంది అధిక చందాదారులు ఈపీఎఫ్‌ఓలో నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో కొత్తగా 62.49 లక్షల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు.

* చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్‌కో గతేడాది లాభాలు దాదాపు సగానికి పడిపోయి 49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. 2019, డిసెంబరులో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత సౌదీ అరామ్‌కో ప్రకటించిన రెండో వార్షిక ఫలితాలు ఇవి. 2018లో అరామ్‌కో 111.2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించగా.. 2019లో అది 88.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇక 2020లో మరింత క్షీణించి 49 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

* భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు మార్చిలో కాస్త నెమ్మదించాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐల ద్వారా రూ.8,642 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్‌ డేటా వెల్లడించింది. ఈక్విటీల్లోకి రూ.14,202 కోట్లు రాగా.. డెట్‌ మార్కెట్ల నుంచి రూ.5,560 కోట్లు వెనక్కి వెళ్లాయి. దీంతో నికరంగా రూ.8,642 కోట్లు వచ్చినట్లు చేరినట్లయింది. జనవరిలో ఎఫ్‌పీఐల ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు, ఫిబ్రవరిలో రూ.23,663 కోట్లు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

* ప్రధాన మంత్రి చెబుతున్న ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే దిగుమతులను ఆపడంకాదని.. దేశీయ పరిశ్రమల తయారీ సామర్థ్యాన్ని పెంచడమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. అమెరికా బాండ్‌ ఈల్డ్‌లు పెరగడం వల్ల తలెత్తే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు కొవిడ్‌ కేసులు పెరగడం వల్ల తలెత్తే పరిస్థితులపై కూడా ఆమె స్పందించారు.

* ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఫ్యూచర్‌ గ్రూప్‌ శనివారం దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌(ఈఏ) ఆదేశాలను సమర్థిస్తూ రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తీర్పును సవాల్‌ చేస్తూ ఫ్యూచర్‌ రిటైల్, ఫ్యూచర్‌ కూపన్స్‌ అదే కోర్టులోని ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. తాజాగా దాఖలు చేసిన అప్పీలును చీఫ్‌ జస్టిస్‌ డి.ఎన్‌. పటేల్, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ఉన్నత ధర్మాసనం మార్చి 22న విచారించనుంది. అయితే, ఏకసభ్య ధర్మాసనం తీర్పు ప్రభావం ప్రస్తుతం ‘నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)‌’ ముందు ఉన్న సర్దుబాటు పథకంపై ఉండబోదని ఫ్యూచర్‌ గ్రూప్‌ చెప్పుకొచ్చింది.