Health

గర్భస్రావాలకు కాలుష్యమే కారణం

Pollution Is Responsible For Pregnancy Loss

ఇబ్బడి ముబ్బడిగా వాహనాల వాడకం, మితిమీరిపోతున్న పరిశ్రమలు ఫలితంగా నానాటికీ గాలికాలుష్యం పెరిగిపోతున్నది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 22 నగరాలకే భారత్‌కు చెందినవే అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అత్యంత కలుషితమై దేశ రాజధానుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలువడం ఆందోళన రేకెత్తిస్తున్నది. స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ -2020 నివేదిక భారత్‌లో నెలకొన్న ప్రమాదరక పరిస్థితిని అద్దం పట్టింది. దాదాపు 106 దేశాల్లోని ప్రభుత్వ సంస్థల రిపోర్టులు, గాలి కాలుష్యాన్ని అంచనా వేసే ప్రత్యేకమైన స్టేషన్ల నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించి రూపొందించిన ఈ జాబితాలో గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ (59.1పీఎం)తో మూడోస్థానంలో ఉండగా, ప్రథమస్థానంలో బంగ్లాదేశ్‌ (77.1పీఎం), ద్వితీయస్థానంలో పాకిస్థాన్‌ (59పీఎం) నిలిచింది. ఇదిలా ఉండగా అత్యధిక గాలి కాలుష్యం గల దేశ రాజధానుల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గాలికాలుష్యం కలిగిన 30 నగరాల్లో 22 భారత్‌కు చెం దిన ఉన్నాయి. టాప్‌ 10 నగరాల్లో మొదటి స్థానంలోని చైనాలోని జిన్జియాంగ్‌ ఉండగా, ఆ తరువాత ఉన్న తొమ్మిది నగరాలు ఇండియావే. భారత్‌లో అత్యధిక కలుషిత నగరాల్లో యూపీలోని ఘజియాబాద్‌, బులంద్‌ షహర్‌, బిస్రఖ్‌, జలాల్‌పూర్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, కాన్పూర్‌, లక్నో, మీరట్‌, ఆగ్రా, ముజఫర్‌నగర్‌, రాజస్థాన్‌లోని బీవండి, జింద్‌, హిసారి, ఫతేహాబాద్‌, బాంధ్వరి, గురుగ్రామ్‌, యమునా,నగర్‌, హర్యానాలోని రోహ్తక్‌, బీహర్‌లోని ముజఫర్‌పూర్‌ ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ నగరాల్లో చాలా వరకు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) పరిధిలోనే ఉండడం గమనార్హం. ఆయా నగరాల్లో గ్లోబర్‌ పార్టికల్‌ కాలుష్యం స్థాయి 2.5కు మించి పదిరెట్ల స్థాయిల్లో గాలి కలుషితమవుతున్నది వెల్లడించింది. ఇక పంజాబ్‌, హర్యానాలో రైతులు పంటవ్యర్థాలను కాల్చివేయడం మూలంగానే ఢిల్లీలో 20-40శాతం మేరకు గాలి కలుషితమవుతున్నది ఆ నివేదిక వెల్లడించడం గమనార్హం. అదేవిధంగా రవాణా, విద్యుత్‌ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణం వ్యర్థాల వద్ద గాలికాలుష్యం పెరిగిపోతున్నదని ఆ నివేదిక స్పష్టం చేసింది. అదేవిధంగా గాలి కాలుష్యం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 70లక్షల గర్భస్రావాలు వాటిల్లుతున్నాయని వెల్లడించింది. ప్రతి 10ఎంఎం గాలి కాలుష్యం పెరగడం వల్ల మహిళల్లో 3శాతం గర్భాధారణ సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించింది. ఇదిలా ఉండగా ఈ నివేదిక వెల్లడించిన గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో గాలి కాలుష్యం 34.4పీఎం స్థాయిల్లో ఉండగా, అది మధ్యస్థాయి మాత్రమేనని, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అతి సాధారణమేనని, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని నివేదిక ఈ సందర్భంగా తెలిపింది. అయితే ప్రపంచ దేశాలు ఇకనైనా గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలను చేపట్టాలని హెచ్చరించింది.