Business

గంగవరం పోర్టు అదానీ సొంతం-వాణిజ్యం

Business News - Adani Group Gets Gangavaram Port In Andhra

* ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు అదానీ గ్రూపు ప్రకటించింది. డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా కొనుగోలుకు రూ.3,604 కోట్ల ఒప్పందం కుదిరనట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వాటా 89.6 శాతానికి చేరనుంది.

* రుణ మారటోరియం గడువు పొడిగించలేం, వడ్డీ మాఫీ చేయలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ.రుణమారటోరియం గడువు పొడిగించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.2020 లో మొత్తం 6 నెలల మారటోరియం కాలంలో తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయజాలమని కూడా కోర్టు పేర్కొంది.లోన్ మారటోరియం కేసుపై విచారణ జరిపిన కోర్టు.. లెండర్లు కూడా షేర్ హోల్డర్లు, డిపాజిటుదారులకు, చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అందువల్ల పూర్తి వడ్డీ మాఫీ సాధ్యం కాదని తెలిపింది.పెన్షనర్లు, ఖాతాదారులకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.. పైగా రుణ మారటోరియం పాలసీలో ఆర్ బీ ఐ, ప్రభుత్వం పాటించే విధానాల్లో మేం జోక్యం చేసుకోజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.ఒక పాలసీ అన్నది లోప భూయిష్టంగా ఉందని భావించినప్పుడు తప్ప ఇతరత్రా ఈ విధమైన వ్యవహారాల్లో మేం కలగజేసుకోబోమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడినబెంచ్ పేర్కొంది.

* కొవిడ్‌-19 మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితుల వల్ల కుప్పకూలిన తయారీ రంగం నెమ్మదిగా కోలుకుంటోందని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) స్పష్టం చేసింది. ‘ఫిక్కీ మానుఫ్యాక్చరింగ్‌ సర్వే’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయంగా తయారీ రంగంలో కొంత సానుకూలత కనిపించింది. 4వ త్రైమాసికంలో బాగా కోలుకున్నట్లు వెల్లడవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అధికోత్పత్తి సాధించినట్లు 24% మంది తెలుపగా, మూడో త్రైమాసికానికి వచ్చే సరికి ఇది 33% అయింది. వాహన, యంత్రపరికరాలు, సిమెంటు- సిరామిక్స్‌, రసాయనాలు, ఎరువులు, ఔషధ, ఎలక్ట్రానిక్స్‌…. తదితర 12 ప్రధాన రంగాలకు చెందిన 300 తయారీ యూనిట్లలో ఫిక్కీ అధ్యయనం చేసింది. ఇందులో భారీ, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.

* ఒక షేరు విలువ ఒక ట్రేడింగ్‌ రోజులో గరిష్ఠంగా పెరిగేందుకు అనుమతించే పరిమితే అప్పర్‌ సర్క్యూట్‌.. గత 96 రోజులుగా, ఒక షేరు ధర రోజూ అప్పర్‌ సర్క్యూట్‌ అయిన 5% పెరుగుతూ వస్తోంది. మూడు నెలల వ్యవధిలోనే ఆ షేరు ధర 10000% పెరగడం స్టాక్‌మార్కెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కంపెనీ.. ఆర్చిడ్‌ ఫార్మా. ఈ షేరు విలువ ఎందుకు ఇంతలా పెరుగుతోంది, ఆ కంపెనీల్లో ఏదైనా ప్రత్యేకత ఉందా.. అనేది ఆసక్తికర విషయం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను లాభాల్లో ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి. ఓ దశలో స్వల్ప కాలం పాటు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ.. తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఉదయం 49,876 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,661 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం 50,264 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 280 పాయింట్లు లాభపడి 50,051 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,768 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,878-14,707 మధ్య కదలాడింది. చివరకు 78 పాయింట్ల లాభంతో 14,814 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.41 వద్ద నిలిచింది.

* టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) భారత్‌లో తొలి విద్యుత్తు కారును విడుదల చేసింది. ఎస్‌యూవీ జాగ్వార్‌ ఐ-పేస్‌ను పూర్తిస్థాయి విద్యుత్తు కారుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంట్లో 90 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 294 కేవీ శక్తిని, 696 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. ప్రతి దశలో వాహనదారుడికి అద్భుతమైన అనుభూతిని అందించేలా, సులువుగా ఆపరేట్‌ చేయగలిగేలా ఎలక్ట్రిక్‌ ఐ-పేస్‌ను రూపొందించామని జాగ్వార్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

* భారత రక్షణ దళాలకు దేశీయ ఆటోమొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ వాహనాలను సరఫరా చేయనుంది. ఇది మహీంద్రా అండ్‌ మహీంద్రాకు అనుబంధ సంస్థ. మొత్తం 1300 లైట్‌ స్పెషలిస్టు వెహికల్స్‌ను దళాలకు సరఫరా చేయనుంది. దళాలను, ఆయుధాలను తరలించడానికి ఈ వాహనాలను ఉపయోగించనున్నారు. ఈ డీల్‌ విలువ రూ.1,056 కోట్లు. వచ్చే నాలుగేళ్లలో ఎండీఎస్‌ సంస్థ ఈ వాహనాలను సరఫరా చేయనుంది.