Business

తగ్గిన ఇంధన ధరలు-వాణిజ్యం

తగ్గిన ఇంధన ధరలు-వాణిజ్యం

* దేశంలో ఇంధన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌ 18పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గిస్తూ నిర్ణయించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఇంతకుముందు రూ.91.17 ఉండగా.. 18పైసలు తగ్గి రూ.90.99కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.81.47 ఉండగా.. 17 పైసలు తగ్గి రూ.81.30 చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.40, డీజిల్‌ ధర రూ.88.42గా నమోదైంది. ఇక హైదరబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.61గా, డీజిల్‌ ధర రూ.88.67గా ఉంది.

* భారత్‌కు గయానా రూపంలో కొత్త చమురు మిత్ర దేశం లభించింది. ఒపెక్‌ ప్లస్‌ దేశాల్లో చమురు ఉత్పత్తి తగ్గిన తరుణంలో అండగా నిలిచేందుకు కొత్త స్నేహహస్తం లభించడం ఊరట కలిగించింది. చమురు విషయంలో భారత్‌ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ తరుణంలో అరబ్‌ దేశాలు ఉత్పత్తి తగ్గించడం సమస్యగా మారింది. దీంతో దేశీయ చమురు శుద్ధి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి కొత్త మిత్రుణ్ని వెతికి పట్టుకున్నాయి.

* స్టాక్‌ మార్కెట్లను బుధవారం కరోనా రెండో వేవ్‌ భయాలు కమ్మేశాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మహమ్మారి కేసులు పెరుగుతున్నాయన్న వార్త మదుపర్లను కలవరపెట్టింది. దీంతో నేడు సూచీలు భారీగా నష్టపోయాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఉదయం 49,786 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. ఇక 14,712 వద్ద మొదలైన నిఫ్టీ రోజులో 14,535-14,752 మధ్య కదలాడింది. 265 పాయింట్లు కుంగి 14,549 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద నిలిచింది.

* హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తన 7 సీట్ల ప్రీమియం స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) అల్కజార్‌ డిజైన్లను మంగళవారం విడుదల చేసింది. హ్యుందాయ్‌ గ్లోబల్‌ డిజైన్‌ ఐడెంటిటీ ఆఫ్‌ సెన్సువస్‌ స్పోర్టీనెస్‌పై వీటిని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అల్కజార్‌ ఆర్కిటెక్చర్, స్టైలింగ్, టెక్నాలజీలు ముఖ్యమైన డిజైన్‌ అంశాలను ఆధునికంగా, 7-సీట్ల ఎస్‌యూవీకి తగ్గినట్లుగా ఉండేలా చేసిందని తెలిపింది. అల్కజార్‌ నమ్మకమైన, వైవిధ్యమైన రూపును సంతరించుకుందని, అసాధారణంగా కనిపించేందుకు దీని ప్రత్యేక డిజైన్‌ థీమ్‌ ఉపయోగపడిందని హ్యుందాయ్‌ పేర్కొంది.