Politics

జస్టిస్ ఎన్.వి.రమణపై జగన్ ఫిర్యాదులు కొట్టివేత

Justice NV Ramana Referred To President As 48th CJI

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. 

ఇదిలావుండగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి బుధవారం సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు.