Sports

కృష్ణుడిపై అక్తర్ ప్రశంసలు

Pak Pacer Shoaib Akhtar Praises Prasiddh Krishna

టీమ్‌ఇండియా నయా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతడు టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌలింగ్‌ చేసి 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలి స్పెల్‌లో ఎక్కువ పరుగులిచ్చిన అతడు తర్వాత అద్భుతంగా పుంజుకొని జట్టు పైచేయి సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. ‘‘అతడు ప్రసిద్ధ్‌ ‘కృష్ణ’ కాదు.. ‘కరిష్మా’(హిందీలో అద్భుతం అనే అర్థం). ఆదిలో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు అతడి బౌలింగ్‌ను దంచికొట్టాక తర్వాతి స్పెల్‌లో అద్భుతంగా తిరిగొచ్చాడు. తొలి వన్డేలోనే ఇలా మంచి ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా మనమేంటో తెలియజేయాలి. నీ నైపుణ్యం, సత్తా చూపించాలి. ఒకసారి ధారాళంగా పరుగులిచ్చాక మళ్లీ తిరిగొచ్చి వికెట్లు తీయగలనని నిరూపించాలి. నాలుగు వికెట్లు తీసిన తీరు నిజంగా అద్భుతం. చాలా బాగా బౌలింగ్‌ చేశావు. దీన్ని ఇలాగే కొనసాగించు. ఎప్పుడైనా బ్యాట్స్‌మెన్‌ నీపై ఆధిపత్యం చెలాయిస్తే కుంగిపోకు. వికెట్లపై దృష్టిసారించి వాటికేసే బంతులు విసురు. ఏం చెయ్యాలో అర్థంకానప్పుడు ఇదే చిట్కా పాటించు’’ అని అక్తర్‌ తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో చెప్పుకొచ్చాడు.