తానా 2021 అధ్యక్ష ఎన్నికల్లో EVPగా పోటీలో ఉన్న డా.నరేన్ కొడాలి తన ప్యానెల్ సభ్యులతో కలిసి డల్లాస్ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం కృష్ణా ప్రవాసులతో సమావేశమై వారి మద్దతును కూడగట్టారు. తనది పెదపారుపూడి మండలం అప్పికట్ల గ్రామమని నరేన్ తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. తమ ప్రచారం మొత్తం సానుకూలమేనని, దుష్ప్రచారాలకు తాము దూరమని పనిచేసే కార్యకర్తలు ఎక్కడున్నా వారికి పట్టం కట్టాలని నరేన్ కోరారు. సంస్థకు ఏది ముఖ్యమో దాన్ని అమలు పరిచే విషయాలపై చర్చలకు తాము సిద్ధమని, చెడును దూరం చేసే అంశాలను ఆకళింపు చేసుకోవడంలో తాము ముందు ఉంటామన్నారు. కృష్ణా ఎన్నారైలకు తానాలో ప్రత్యేక పరపతి ఉందని, దీనికి తోడు డల్లాస్‌లో ఉన్న ఈ జిల్లా ప్రవాసులకు తానా ఎన్నికల్లో నిర్ణయాధికారం ఎక్కువగా ఉందని అందుకే వారు సంస్థ భవిష్యత్తుకు ఉపయోగపడే తమ ప్యానెల్‌ను బలపరచాలని కోరారు.
* హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్పీగా….వేమన సతీష్
తానాలో కృష్ణా జిల్లా అల్లుడిగా మొదలుపెట్టిన తన పయనం RVPగా, కోశాధికారిగా, కార్యదర్శిగా పలు పదవుల మీదుగా అధ్యక్ష పదవి వరకు వచ్చిందని, ఒక హెడ్ కానిస్టేబుల్ ఎస్పీగా ఎదిగితే ఎలా ఉంటుందో తానాలో తన గమనం అలా ఉందని, ఆరాటపడితే అధ్యక్షులు కాలేరని సంస్థలో 18ఏళ్ల అనుభవం కలిగిన నరేన్ ప్యానెల్‌కి మద్దతు తెలపాలని మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ కోరారు.
* నేనే తొలి సైనికుడిని…జయరాం
సంస్థలో తనకు ప్రస్తుతం ఎటువంటి పదవి లేనప్పటికీ గత రెండు వారాలుగా కాళ్లకు బలపం కట్టుకుని నరేన్ ప్యానెల్‌కు తాను ప్రచారం చేయడం వెనుక ప్రధానోద్దేశం తానాను కాపాడుకోవడమేనని మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం అన్నారు. సంస్థ దారితప్పుతుందని తనకు అనిపిస్తే….ముందు వరుసలో పోరాడే తొలిసైనికుడిని తానే అవుతానని అన్నారు.
* వీరి పనితనం నాకు తెలుసు…కేసీ చేకూరి
2011 నుండి నరేన్‌తో తనకు అనుబంధం ఉందని, తానా కాన్ఫరెన్సుల్లో నరేన్ ప్యానెల్ అభ్యర్థులతో తాను కలిసి పనిచేశానని, ప్రత్యర్థి ప్యానెల్‌లో కూడా కష్టపడే కార్యకర్తలు ఉన్నప్పటికీ నరేన్ ప్యానెల్‌లో అధిక సంఖ్యలో ఉన్న కారణంగా తాను వారికి మద్దతు తెలుపుతున్నానని కేసీ చేకూరి అన్నారు.
తానా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు తమ వాణిని స్థానిక ప్రవాసులతో విన్నవించుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చాగర్లమూడి సుగన్ సమన్వయపరిచారు. కృష్ణా ఎన్నారై ఏ ప్యానెల్‌కు అనుకూలం కాదని, కేవలం అభ్యర్థులకు కృష్ణా జిల్లా ప్రవాసులకు మధ్య వారధిగా వ్యవహరించే ఓ తటస్థ వేదికగా మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
############