మరో నాలుగు రోజుల్లో ప్రారంభమవుతున్న కొత్త ఆర్థిక సంవత్సరం(2021-22)లో రైతులకివ్వాల్సిన పంటరుణాలను ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సాంకేతిక కమిటీ’(స్టేట్ లెవల్ బ్యాంకర్స్ టెక్నికల్ కమిటీ- ఎస్‌ఎల్‌టీసీ) తాజాగా ఖరారు చేసింది. వరి పంట సాగు వ్యయం పెరిగిందని ఎకరా సాగుకు 45 వేల వరకు రుణమివ్వాలని అధికారులు కోరగా ఎస్‌ఎల్‌టీసీ మాత్రం రూ.34 వేలకే పరిమితం చేసింది. పత్తి పంటకి రూ.53 వేలు కోరగా రూ.35-38 వేలే ఇస్తామని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో రైతులు అధికంగా సాగుచేస్తున్న పత్తి, వరి పంటలకు గతంతో పోల్చినా, అధికారులిచ్చిన ప్రతిపాదనల ప్రకారమూ పంటరుణాన్ని పెంచడానికి ఈ కమిటీ అంగీకరించలేదు. కానీ కొత్త పంటలకు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కల సాగుకు రుణ పరిమితి పెంచింది. ప్రభుత్వ సూచన మేరకు ఆయిల్‌పాం తోటల సాగును పెద్దయెత్తున ప్రోత్సహించాలని ఎకరానికి రూ.57 వేల దాకా రుణం ఇవ్వాలని జిల్లా అధికారులు అడగ్గా… రూ.38 వేలు మాత్రమే ఇవ్వాలని ఎస్‌ఎల్‌టీసీ నిర్ణయించింది. దీంతో ఈ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే నాలుగేళ్ల తర్వాతే ఈ పంట మొదటి కోత వస్తుంది. తొలి ఏడాదిలో పెట్టుబడి ఖర్చులకు సరిపోను రుణం ఇవ్వకపోతే రైతులు ముందుకొస్తారా అనేది అనుమానమే. మార్కెట్‌లో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. వీటి ఉత్పత్తికి అవసరమైన నూనెగింజల పంటల దిగుబడులు పెద్దగా లేవు. అయినా ఈ పంట సాగుకు రుణం పెంచలేదు. ఉమ్మడి వరంగల్ అధికారులు ఎకరానికి రూ.30 వేలు అడిగితే రూ.19-26 వేలే ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఏటా ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 2021 నుంచి 2022 మార్చి వరకూ ఏ పంట సాగుకు ఎకరానికి ఎంత రుణం ఇవ్వాలనేది ఎస్‌ఎల్‌టీసీ ఖరారు చేస్తుంది. దీన్ని ‘రుణ పరిమితి’(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అని పిలుస్తారు. ఈ కమిటీ ఖరారుచేసిన దానికన్నా ఎక్కువ రుణాన్ని ఏ బ్యాంకు కూడా ఇవ్వదు. గ్రామాల్లో పంటల సాగు, పాడిపశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ఎంత ఖర్చవుతుందనేది జిల్లా అధికారుల నుంచి ఎస్‌ఎల్‌టీసీకి మూడు నెలల క్రితం ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని పరిశీలించి గతేడాదికన్నా పెంచాలా వద్దా అనేది వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులతో కమిటీ చర్చించింది. ఈ మేరకు కొన్ని పంటలకిచ్చే రుణాన్ని పెంచాలనే ప్రతిపాదనను తిరస్కరించి, మరికొన్నింటికి పెంచింది.
* నాలుగు పందులు పెంచాలనుకుంటే బ్యాంకులు రూ.43 వేల రుణం ఇవ్వాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది.
* చైనాలో పండే డ్రాగన్‌ఫ్రూట్ తోటలను సాగుచేస్తే రూ.4.35 లక్షలు ఇవ్వాలని ఉమ్మడి మెదక్, రూ.లక్ష ఇస్తే చాలని నల్గొండ జిల్లా అధికారులు సిఫార్సు చేశారు. ఈ తోట సాగుకు అధిక వ్యయమవుతుందని ఎకరానికి రూ.6,61,500 ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ పంటను ఆసక్తి గల రైతులు మాత్రమే అక్కడక్కడ పండిస్తున్నారు. చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి ఈ పండ్లు తెచ్చి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నందున ఈ పంట సాగుకు అధిక రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
* ఉల్లిగడ్డ వేస్తే రూ.40 వేలు, ఆలుగడ్డకు రూ.44 వేలు, అల్లం తోటకు రూ.63,000, వెల్లుల్లి వేస్తే రూ.38 వేలు రుణం ఇవ్వాలని నిర్ణయించింది. పందిరి కూరగాయల సాగుకు రూ.3,00,000 ఇవ్వనున్నారు.
* మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకానికి రూ.50 వేలు ఇస్తారు.
* సేంద్రియ కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రుణాలు ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ఎవరైనా ఇంటి మిద్దెపై కూరగాయలు పండించుకుంటే ఏడాదికి మూడు సార్లు బ్యాంకులు అప్పు ఇస్తాయి. తొలి పంటకు రూ.10,500, అది చెల్లిస్తే రూ.21 వేలు, అది కూడా కడితే మూడోసారి రూ.31,500 రుణంగా ఇస్తాయి. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు మాత్రమే ఇలా ఇంటి మిద్దెలపై(రూఫ్‌గార్డెన్) వేసే కూరగాయల పంటల సాగుకు రుణం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాయి. రాష్ట్రమంతా దీన్ని అమలుచేయాలని ఎస్‌ఎల్‌టీసీ రుణ పరిమితిని ఖరారుచేసింది. మిద్దెలపై అత్యధికంగా కూరగాయలు పండిస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ఈ ప్రతిపాదన పంపకపోవడం గమనార్హం.
* తులసి వేస్తే ఎకరానికి రూ.18,500 ఇస్తారు.
* గొర్రెలు లేదా మేకలు 21 పెంచితే రూ.12 వేలు రుణంగా ఇస్తారు.