WorldWonders

శునకాలు గుఱ్ఱాలకు పెన్షన్

శునకాలు గుఱ్ఱాలకు పెన్షన్

భవనాలు కూలిపోయిన సమయంలో.. ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తాయి. పేలుడు పదార్థాల స్మగ్లర్లను గుర్తించి రౌడీ మూకలను నియంత్రించడంలో సాయపడతాయి. సైన్యంలో సిబ్బందికి అండగా ఉంటాయి. ఇలా నిత్యం ఎన్నో సేవలందించే శునకాలు, అశ్వాలకు పింఛను ఇవ్వాలని యోచిస్తోంది పోలాండ్ ప్రభుత్వం​. పోలీసు, సైనిక, అగ్నిమాపక విభాగాల్లో.. ఎన్నో సేవలందించిన శునకాలు, అశ్వాలకు పింఛను అందించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది పోలాండ్​ ప్రభుత్వం. పదవీ విరమణ అనంతరం.. వాటి సంరక్షణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని సంబంధిత విభాగాల సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. జంతువులకు అధికారిక హోదాను కల్పించే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ ముసాయిదా చట్టాన్ని నైతిక బాధ్యతగా అభివర్ణించారు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మారియస్జ్​ కామిన్​స్కి. ఈ ఏడాది చివర్లో దీన్ని పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.దేశంలో.. ఏటా 10శాతం జంతువులు పదవీ విరమణ పొందుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే.. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న 1,200 శునకాలకు, 60కిపైగా గుర్రాలకు లబ్ధి చేకూరనుందని పేర్కొంది. వీటిలో జర్మన్​, బెల్జియం శునకాలే అధికంగా ఉన్నాయి.పదవీ విరమణ తర్వాత వాటికిచ్చే పింఛను సొమ్ము.. వాటికందించే వైద్య, ఇతర సేవలకు ఎంతగానో అండగా ఉంటాయని డాగ్​ స్క్వాడ్​ అధికారులు తెలిపారు.