తానా సంస్థ అతి పురాతనమైన, ప్రముఖమైన ఓ అంతర్జాతీయ తెలుగు సంఘమని, అలాంటి సంస్థ 44ఏళ్ల ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఒడిదుడుకల సమయంలో దానికి తోడుగా నిలిచి దానితో పయనించి ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకుని దాని భవిత కోసం కష్టపడే వారికి ఎవరికైనా తమకు ఓటు వేయమని అడిగే హక్కు ఉంటుందని, అలా ధైర్యంగా ఒటు అడిగే హక్కు తమ ప్యానెల్‌కు ఉందని తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తలపడుతున్న డా.కొడాలి నరేన్ అన్నారు. సోమవారం సాయంత్రం హ్యూస్టన్ ప్రవాసులతో స్థానిక గోదావరిలో సమావేశమైన ఆయన తన ప్యానెల్‌ను పరిచయం చేసి ప్రసంగించారు. సంస్థ దినదినప్రవర్ధమానంగా వెలుగొందాలని ఆకాంక్షించే వారిలో తాను, తన ప్యానెల్ ప్రప్రథములమని అందుకే తమను బలపరచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్యానెల్ సభ్యులు విజయ్ గుడిసేవ, రాజా సూరపనేని, మన్నే సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు ఉన్నారు. నేటితో టెక్సాస్ పర్యటన ముగించుకుని ఈ వారాంతం నరేన్ ప్యానెల్ అట్లాంటాలో పర్యటిస్తుంది.
######################