ఉన్నది వున్నట్లుగా ఒక్క అక్షరం ముక్క గూడా తేడా లేకుండా పులుస్టాపులు, కామాలతో సహా రాస్తే దానిని మక్కికి మక్కి అంటారు. అచ్చు గుద్దినట్లు, తూచా తప్పకుండా అని కూడా ఈ జాతీయాన్ని వాడతారు.
నిజానికి మక్కికి మక్కి అనేది వ్యంగ్యంగా వ్యతిరేకార్థంలో వాడే పదం. కొందరు ఎదుటివారు రాసింది రాసినట్లు అచ్చుదింపేటప్పుడు… వాళ్ళు చేసిన తప్పులు, పొరపాట్లు గూడా అలాగే రాసేస్తుంటారు. కొంచం గూడా స్వంత తెలివితేటలు ఉపయోగించరు. ఏమాత్రం తెలివితేటలు ఉపయోగించకుండా వున్నది వున్నట్లు రాస్తే దానిని మక్కికి మక్కి అనవచ్చు.
పరీక్షల్లో కొందరు కాపీలు కొడుతూ వుంటారు. కాపీలో జవాబు సగం ముందు, సగం వెనుక పేజీలో వున్నప్పుడు… మొదటి పేజీ చివర త్రిప్పి చూడుడు లేదా మిగతా జవాబు వెనుక పేజీలో అని వుంటుంది. ఈ బుర్రలేని కాపీ రాయుళ్ళు, దానిని ఏమాత్రం గ్రహించకుండా తమ జవాబు పత్రాల్లో గూడా ‘త్రిప్పి చూడుము’ అని రాసేస్తూ వుంటారు. దానినే మక్కికి మక్కి అంటారు.
మక్కి అంటే ఈగ. మక్కికి మక్కి అంటే ఈగకు ఈగ అని అర్థం. ఒక విద్యార్థి రాత్రి సైన్సు నోట్సు రాస్తూ వున్నాడు. అక్కడ కొన్ని ఈగలు తిరుగుతున్నాయి. ఆ పిల్లవాడు నోట్సు పూర్తి చేసి పుస్తకం మూసేటప్పుడు అనుకోకుండా ఒక ఈగ పుస్తకం మధ్యలోకి పోయింది. అంతే పాపం అది అక్కడికక్కడే చచ్చిపోయి కాగితానికి అంటుకు పోయింది. తరువాత రోజు ఆ పుస్తకాన్ని వాని స్నేహితుడు తీసుకొని పోయాడు. వానికి కొంచం గూడా బుర్ర లేదు. నోట్సు ఎత్తి రాస్తున్నాడు. అట్లా రాస్తా వున్నప్పుడు ఒక పేజీలో చచ్చిన ఈగ పేజీ మధ్యలో అంటుకొని కనబడింది. వెంటనే వాడు గూడా కష్టపడి ఒక ఈగను పట్టుకొని చంపి దానికి గమ్ము వేసి పేజీ మధ్యలో అంటించినాడంట. సార్ పుస్తకాలు చూస్తున్నప్పుడు మధ్యలో ఈగ కనబడితే “ఏరా ఇక్కడ ఈగ పడితే చూసుకోలేదా” అన్నాడు. దానికి వాడు గర్వంగా “సార్… మన రాము నోట్సులో ఈగ వుంటే నేను కూడా కష్టపడి ఈగను చంపి అతికించా సార్” అన్నాడట. విషయం తెలిసి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలూ పడీ పడీ నవ్వుతూ “అయితే ‘మక్కికి మక్కి’ (ఈగకు ఈగ) దించేశావన్నమాట” అన్నారు. అలా ఈ జాతీయం ఉద్భవించింది.