Movies

సగం తీరింది

సగం తీరింది

‘‘సినిమాల్లో నా ప్రయాణం మొదలైనప్పట్నుంచీ తెలుగులో నాగార్జున, వెంకటేశ్‌తో నటించడం నా కల అని చెబుతుండేదాన్ని. అందులో సగం నెరవేరింది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని, త్వరలో వెంకటేశ్‌తో నటిస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు దియా మీర్జా. నాగార్జునకు జోడీగా ఆమె నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. దియా మీర్జా మాట్లాడుతూ ‘‘నాగార్జునగారి సోదరి, మా అమ్మ స్నేహితులు. చిన్నతనంలో సుప్రియ (నాగార్జున మేనకోడలు) బొమ్మలతో ఆడుకుంటుండేదాన్ని. అమ్మ నాగార్జున గురించి చెబుతుండేది. కానీ, ఆయన్ను కలిసి 20 ఏళ్లైంది. అందుకని, తొలి సన్నివేశం చేసేటప్పుడు కాస్త నెర్వస్‌కి లోనయ్యా. ఇందులో నాగార్జున భార్యగా కనిపిస్తా. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న అధికారుల కుటుంబ జీవితాల్ని పాక్షికంగా ఆవిష్కరిస్తుందీ సినిమా. నేను స్ర్కిప్ట్‌ మొత్తం చదివా. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. ప్రతి యాక్షన్‌ చిత్రానికి ఓ ఆత్మ కావాలి కదా! అది నా పాత్ర, సన్నివేశాలు అని చెప్పవచ్చు. నేను హైదరాబాదీ అమ్మాయిని. తెలుగు బాగా అర్థమవుతుంది. నా పాత్రకు డబ్బింగ్‌ కూడా చెప్పాలనుకున్నా. కానీ, కుదరలేదు’’ అన్నారు. తెలుగు, హిందీ చిత్రసీమల గురించి దియా చెబుతూ ‘‘తెలుగు సినిమా సెట్స్‌లో మహిళలు తక్కువ. హిందీ సినిమా సెట్స్‌లో ఎక్కువమంది ఉంటారు. ప్రధాన వ్యత్యాసమదే. మిగతావి చిన్నవే’’ అని తెలిపారు. ఓటీటీకి మార్గదర్శకాలు ఉండాలే తప్ప సెన్సార్‌షిప్‌ అవసరం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.