తితిదేపై కుట్రపూరిత అజెండాతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అన్నమయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిజోరం-మయన్మార్ సరిహద్దుల్లో కస్టమ్స్ అధికారులు, అస్సాం రైఫిల్స్ బలగాలు సీజ్ చేసిన తలనీలాలకు సంబంధించి అక్కడి అధికారులు తయారుచేసిన నివేదికను(సీజ్ రిపోర్టు) మీడియాకు విడుదల చేశారు. కస్టమ్స్ అధికారుల సీజ్ రిపోర్టులో ఫిబ్రవరి 8న మిజోరంలో సీజ్ చేసిన నాన్ ప్రాసెస్డ్ తుక్కు వెంట్రుకల విలువ రూ.18,17,089గా పేర్కొన్నారని తెలిపారు. ఆ నివేదికలో ఎక్కడా తితిదే పేరుగాని, దక్షిణ భారతదేశం నుంచి వచ్చినట్లుగాని లేదని తెలిపారు. స్వాధీనమైన తలనీలాలు స్థానికంగానే సేకరించినట్లు అందులో పేర్కొన్నారని చెప్పారు. తలనీలాలతో చిక్కిన ట్రక్కు మిజోరం రాష్ట్రానికి చెందిందని తెలిపారు. తలనీలాల స్మగ్లింగ్‌లో ఎటువంటి సంబంధం లేకపోయినా తితిదేను, రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తితిదేపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులు, మీడియా సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
అస్సాం జుట్టుకు…తితిదేకు సంబంధం లేదు
Related tags :