* తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. ఈరోజు ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవీణ్‌రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరో సంఘటనలో 27ఏళ్ల మురికిపూడి రేణు సూర్య ప్రతాప్ కూడా మరణించాడు. ఇతను 2018లో కెనడా వచ్చాడు. ఇటీవలే విండ్సర్ యూనివర్శిటీ నుండి MS పూర్తి చేశాడు.
* మంజూర్ అహ్మద్ వాగే కుమారుడు 24ఏళ్ల షకీర్ 2016లో భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీలో రైఫిల్‌మన్‌గా చేరాడు. గతేడాది ఆగస్టు 2న ఈద్‌ను పురస్కరించుకుని సెలవుపై ఇంటికి వచ్చాడు. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి సాయంత్రం తిరిగి ఆర్మీ క్యాంప్‌కు బయల్దేరాడు. షకీర్‌ను వాళ్ల కుటుంబ సభ్యులు చూడటం అదే చివరిసారి. ఆ తర్వాత గంటకు షకీర్.. ఇంటికి ఫోన్ చేసి తాను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని, ఆర్మీ అధికారులు ఫోన్ చేసి అడిగితే కంగారుపడొద్దని చెప్పాడు. అతడి నుంచి వచ్చిన చివరి మాటలు కూడా అవే. ఆ మరుసటి రోజే కుల్గాం జిల్లాలో షకీర్ వాహనం మంటల్లో పూర్తిగా కాలిపోయి కన్పించింది. అతడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
* మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసినట్లు ఏపీ సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61శాతం పదవులు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ తరగతుల కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. దీనికోసం ప్రతి వార్డుకు 2 చొప్పున 8వేల వాహనాలు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
* దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే రావడం కలవరపెడుతోంది. కేవలం మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాగా మార్చిలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అన్ని రకాల వయసుల వారూ వైరస్ బారిన పడ్డట్లు తెలిపింది. ఇందులో 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలో 1.34(22 శాతం) లక్షల మందికి పాజిటివ్ రాగా, 10-15 ఏళ్ల మధ్య పిల్లల్లో 500 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
* ‘సినిమా రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రకాశ్ జావడేకర్, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్, నా స్నేహితుడు రాజ్ బహదూర్, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, అలాగే ఈ రజనీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వన్, ప్రతిపక్ష పార్టీ నేత స్టాలిన్, కమల్‌హాసన్‌తోపాటు ఇతర రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్!!’’అని రజనీ పేర్కొన్నారు.
* బెంగాల్, అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. భాజపా, తృణమూల్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఓటర్లు చైతన్యాన్ని చాటారు. భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరగగా సాయంత్రం 7గంటల వరకు 80.43శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ముఖ్యంగా మమతా, సువేందు అధికారి బరిలోఉన్న నందిగ్రామ్‌లోనూ భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం విశేషం. నందిగ్రామ్ నియోజకవర్గంలో 80శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అత్యధికంగా కతూల్‌పూర్ నియోజకవర్గంలో 87శాతం ఓటింగ్ నమోదుకాగా, చంద్రకోనా, ఇండస్, పత్తార్‌ప్రతిమ నియోజకవర్గాల్లో 86శాతం ఓటింగ్ నమోదైంది.
* ధ్వని కాలుష్యం కలిగించే వాహనాలపై రాజమహేంద్రవరం పోలీసులు చర్యలు చేపట్టారు. 80 డెసిబుల్స్‌కు మించి శబ్దం కలిగించే ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు. ట్రాఫిక్ డీఎస్పీ కెవీఎన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 74 వాహనాల సైలెన్సర్‌లను వాటి యజమానుల ద్వారా తీయించారు. అనంతరం వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు.
* యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. గురువారం రెండో దశ పోలింగ్‌లో భాగంగా నందిగ్రామ్ సహా 30 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించగా కొన్ని చోట్ల ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు బెంగాల్ పర్యటనలో ఉన్న మోదీ నేడు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. నందిగ్రామ్‌లో ఓడిపోతాననే భయంతో మరో చోట నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.
* 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు రూ.18వేలకోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు సీఎండీ పీకే రథ్ తెలిపారు. ఇది విశాఖ ఉక్కు చరిత్రలోనే రెండో అత్యధికమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు.
* తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై వ్యక్తిగత దూషణకు పాల్పడిన డీఎంకే ఎంపీ ఎ.రాజాపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో 48గంటల పాటు ఆయన పాల్గొనరాదని ఆదేశించింది. తమిళనాడు సీఎంపై రాజా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్‌ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని తెలిపింది. డీఎంకే స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి రాజా పేరును తొలగించింది.
* నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గో మహాగర్జన’లో అపశ్రుతి చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరగడంతో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మూడు గుడారాలు కూడా కాలిపోయాయి.
* దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాల్లో భాగంగా రాష్ట్రానికి 12 అవార్డులు లభించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకకర్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావులను కేటీఆర్ సన్మానించి, అభినందించారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో ఎర్రబెల్లి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో అభివృద్ధి సాధించిన పంచాయతీలకు అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అవార్డులు వచ్చేలా కష్టపడి పనిచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహా ప్రతి ఒక్కరినీ కేటీఆర్ అభినందించారు.
* మహిళలకు పేరెంటల్ సెలవులు ఇవ్వడం ప్రస్తుతం అన్నిదేశాల్లో సాధారణంగా ఉన్నదే. అయితే, మగ వాళ్లకు కూడా ఈ రకం సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నది. తమ లింగ తటస్థ విధానం ‘ఫ్యామిలీ బాండ్’ ను వోల్వో సంస్థ ప్రకటించింది. ఈ విధానం ప్రకారం ఇప్పుడు మగ ఉద్యోగులు కూడా పేరెంటల్ లీవ్ పొందనున్నారు. ఈ నిర్ణయం భారతదేశంలోని మగ ఉద్యోగులకు మొత్తం జీతంలో 80 శాతం చొప్పున 24 వారాల (120 పనిదినాలు) పేరెంటల్ సెలవు పొందటానికి వీలు కల్పిస్తున్నది. ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం, 2017 ప్రకారం మహిళా ఉద్యోగులు 26 వారాల పూర్తి చెల్లింపు ప్రసూతి సెలవులను కొనసాగిస్తారని వోల్వో కార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.