* ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అనంతరం నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయిందని, ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు.
* దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. గత 24 గంటల్లో 3,583 కొత్త కేసులు నమోదవ్వడంతో అప్రమత్తమైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో రాజధాని నగరంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో ప్రస్తుతం నాలుగో వేవ్ కొనసాగుతోందని చెప్పారు. అందువల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే, నగరంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచనేదీ తమకు లేదని స్పష్టంచేశారు. కరోనాతో నెలకొంటున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఎక్కువమంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకోకపోవడమే గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ ఉన్నతేడా అన్నారు. ప్రస్తుతానికైతే నగరంలో లాక్‌డౌన్ అమలుచేయాలన్న ఆలోచన తమకు లేదన్నారు. భవిష్యత్తులో అవసరమైతే ప్రజలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
* తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ‘కేసీఆర్ ఆపద్బంధు’ పథకాన్ని ప్రారభించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాఖా పరంగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో తన నివాసంలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. బీసీ మహిళల స్వావలంబన కోసం రూ.100 కోట్లతో మరో నూతన పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నిఫ్ట్‌లో శిక్షణ అందించడంతో పాటు 25 మంది సభ్యులు యూనిట్‌గా ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్లు, అన్ని రకాల కుట్టు యంత్రాలను అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు, వర్గాల వారీగా ఒక్కో వర్గంలో ఐదువేల మందికి చొప్పున పనిముట్లను అందించే పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. రూ. 300 కోట్ల వ్యయంతో దాదాపు 50వేల బీసీ యువతీ యువకులకు ఏసీ రిపేర్, టూవీలర్ రిపేర్ తదితర వృత్తివిద్యలపై శిక్షణ, పనిముట్లు అందించి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామన్నారు.
* డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్ ఫ్లైఓవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. తన వాహనం తిరిగి ఇవ్వాలంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శంషాబాద్ ఆర్‌జేఐఏ పోలీసు స్టేషన్ ఎదుట జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొత్తపేటకు చెందిన నాగరాజు నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం మద్యం సేవించి ఆటో నడపడంతో ఆర్‌జేఐఏ ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని వాహనం సీజ్ చేశారు. అప్పటి నుంచి నాగరాజు ఠాణా చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ ఆటో ఇవ్వకపోడంతో మనస్తాపం చెందిన నాగరాజు శుక్రవారం స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నాగరాజుకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగిందని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.
* ఐటీ రంగంలో ఎక్కువ మంది నిపుణులను అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఐటీ చొచ్చుకుపోయిందని.. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విజయవాడలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎక్స్ఓ రౌండ్ టేబుల్ సదస్సుకు 76 ఐటీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా అనంతర పరిణామాలతో పాటు దిద్దుబాటు చర్యపైన సదస్సులో విస్తృతంగా చర్చించారు.
* తెరాస ప్రభుత్వం తీరుతో యువత నిరుత్సాహానికి గురైందనడానికి నిరుద్యోగి సునీల్ నాయక్ ఆత్మహత్యే నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యోగావకాశాల కోసం యువత పోరాడిందని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీని ఒక్కరితో నడపడం ప్రభుత్వం తీరుకు నిదర్శనమన్నారు.
* గత నెలలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ఇంటికే వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు పడింది. కొవిడ్ టీకా పంపిణీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 2న హవేరి జిల్లా హిరెకెరూర్ తాలుకా వైద్యాధికారి డాక్టర్ జెడర్ ముఖందర్ నేరుగా మంత్రి ఇంటికే వెళ్లి బీసీ పాటిల్, ఆయన సతీమణికి టీకా వేయించారు. ఆ ఫొటోలను మంత్రి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శిక్షణలో పదే పదే సూచించినప్పటికీ ఇంటికి వెళ్లి టీకా వేయడంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
* ఏపీలో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని ఆయన ఆరోపించారు. పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల బహిష్కరణపై తెదేపా పొలిట్‌బ్యూరో చర్చించిన అనంతరం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
* అసోంలో గురువారం రెండోదశ పోలింగ్ అనంతరం ఈవీఎంల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భాజపా నేతకు చెందిన కారులో ఈవీఎంలను తరలించారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఎన్నికల సంఘం దర్యాప్తునకు ఆదేశించింది. కరీమ్‌గంజ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించిన నలుగురు పోలింగ్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు.. ఆ బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించింది.
* ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు శుక్రవారం ధ్వంసం చేయించారు. డీఎస్పీ వినోద్ కుమార్ సమక్షంలో 166 లీటర్ల సారాతో పాటు 423 టెట్రా బాటిల్స్‌ను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సారా, అక్రమ మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
* తమిళనాడులో శాసనసభ ఎన్నికల ముందు డీఎంకే నేతల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను సోదాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఓటమి భయంతోనే భాజపా ఇలాంటి దాడులకు పాల్పడుతోందంటూ ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల్లో ఓటమి ఎదురవుతున్న సమయంలో భాజపా ఉపయోగించే సిద్ధాంతం.. ప్రతిపక్షాలపై దాడులు చేయించడం’’ అని రాహుల్ విమర్శించారు.
* కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తన భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నేటి అసోం ఎన్నికల పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. నిన్న కొవిడ్ పరీక్షలు చేయించుకోగా తనకు నెగెటివ్ వచ్చిందని ప్రియాంక వెల్లడించారు. కానీ, వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో వెళ్తున్నానంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ ఈ రోజు అసోం, రేపు తమిళనాడు, ఆదివారం రోజున కేరళలో పర్యటించాల్సి ఉంది. అయితే, కొవిడ్ కలకలం నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నందున ప్రతిఒక్కరినీ క్షమాపణ కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
* అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖమ్మంలో రూ.30 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ రెండో దశకు భూమిపూజ చేశారు.
* దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో మహాప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాగ్‌పూర్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. తాజాగా పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు. శనివారం నుంచి వారం రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పుణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావ్ వెల్లడించారు.