ఇంద్రకీలాద్రిపై ఈనెల 13వ తేదీన శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 13న సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, ప్రభాత అర్చన, హారతి అనంతరం ఉదయం 8గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. అనంతరం 10.30 గంటలకు ప్రధాన ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కలశస్థాపన, ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు మల్లికార్జున మహామండప ప్రాంగణంలో భక్తుల సమక్షంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం 4గంటలకు రుద్రహోమ యాగశాల నందు అగ్నిప్రతిష్ఠాపన, మండప పూజలు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 5గంటలకు గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన వెండి రథంలో ఉంచి నగరోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు.
*20 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు:
ఘాట్‌రోడ్డులోని క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వామి వారికి 20న తమలపాకు పూజతో శ్రీరామ నవమి వేడుకలు లాంఛనంగా ప్రారంభిస్తారు.21వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 10.30 గంటలకు సీతారాముల కల్యాణం భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. 22న ఉదయం 11గంటలకు పట్టాభిషేకోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి.
**చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు:
ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు దుర్గమ్మకు శ్రీప్లవ నామ చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 13న మల్లెపూలు, మరువం, 14న కనకాంబరాలు, ఎర్రగులాబీలు, 15న తెల్ల చామంతి, 16న మందార, ఎర్రకలువలు, 17న తెల్లజిల్లేడు, మేడు, తులసి, మరువం, 18న కాగడా మల్లెలు, జాజులు, మరువం, 19న ఎర్రతామరలు, గన్నేరు, 20న పసుపు చామంతి, సంపెంగలు, 21న కనకాంబరాలు, ఎర్రగులాబీలతో పుష్పార్చన నిర్వహిస్తారని తెలిపారు. తొలి రోజు 13న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు మిగతా రోజుల్లో ఉదయం 8 నుంచి 10గంటల వరకు పుష్పార్చన ఉంటుంద న్నారు.టిక్కెట్ రుసుం రోజుకు రూ.2,500గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
బెజవాడలో 13న ఉగాది
Related tags :