Business

కరోనా కారణంగా కుదేలయిన స్టాక్ మార్కెట్-వాణిజ్యం

COVID Impact On Stock Markets - Telugu Business News

* దేశంలో మరోసారి కరోనా వైరస్‌ భారీ స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్నకొద్దీ అంతకంతకూ దిగజారాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ప్రతికూలంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1,449 పాయింట్లు కుంగి 48,580 వద్ద.. నిఫ్టీ 408 పాయింట్లు కోల్పోయి 14,459 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువలో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిష్ఠాల నుంచి సూచీలు కోలుకున్నప్పటికీ.. లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 870 పాయింట్ల నష్టంతో 49,159 వద్ద… నిఫ్టీ 229 పాయింట్లు కోల్పోయి 14,637 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.33 వద్ద స్థిరపడింది.

* పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) ఒకటి. దీంట్లో కచ్చితమైన ఆదాయం రావడంతోపాటు నష్టభయం తక్కువ. అందుకే చాలా మంది మదుపు చేయడానికి ఎఫ్‌డీని ఎంచుకుంటారు. ప్రస్తుతం ఎఫ్‌డీ రేట్లు తక్కువగానే ఉన్నప్పటికీ.. సేవింగ్స్ అకౌంట్స్‌ వడ్డీతో పోలిస్తే మెరుగే. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌కి ఇస్తున్న ఎఫ్‌డీ రేట్లు ఫరవాలేదు. ఇక కొవిడ్‌ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో చాలా మందికి ఎఫ్‌డీ ఫేవరెట్‌ ఇన్వెస్టింగ్‌ ఆప్షన్‌గా ఉంది. అయితే, ఎఫ్‌డీపై వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో దీన్ని ‘ఇతర ఆదాయ వనరుల(ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌)’ కింద చూపించాల్సి ఉంటుంది. ఎఫ్‌డీపై లభించిన రాబడిని మన ఏడాది మొత్తం ఆదాయంలో జోడించాలి. దానికనుగుణంగా మన పన్ను శ్లాబును నిర్ణయిస్తారు. ఒకవేళ మొత్తం ఆదాయం ఏ శ్లాబులోకి రాకపోతే ఎలాంటి పన్ను ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌, సేవింగ్స్‌ ఖాతా ద్వారా పొందే వడ్డీ ఆదాయంపై సీనియర్‌ సిటిజన్లకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఏడాదికి రూ.50 వేల వరకు ఆదాయపు పన్నులో వారు మినహాయింపు కోరవచ్చు.

* దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్ఠానికి చేరాయి. మరోసారి కరోనా విజృంభిస్తుండడంతో మార్చిలో గిరాకీ క్షీణించింది. ఈ ప్రభావం ఉత్పత్తి కార్యకలాపాలపై కూడా పడినట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ నెలవారీ సర్వే వెల్లడించింది‌. ఇక ఫిబ్రవరిలో 57.5గా ఉన్న మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) గత నెల 55.4కు తగ్గింది. అయితే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు.. అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.

* కొత్త కారును కొనుగోలు చేయాలన్నా లేదా పాత కారును అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా లేదా కుటుంబానికి మరొక కారు కొనుగోలు చేయాలనుకున్నా కారణం ఏమైనప్పటికీ, రుణం తీసుకుని కారును సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. సాధారణంగా బ్యాంకులు కారు రుణాలను మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో అందిస్తాయి, కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఏడు సంవత్సరాల కాలపరిమిత‌తో రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఎక్కువ కాలపరిమితితో రుణం తీసుకుంటే, నెల‌వారీగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ మొత్తం త‌క్కువ‌గా ఉంటుంది. ఇది కారు కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది, కానీ ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, కారు తరుగుదల ఆస్తి, కాబ‌ట్టి ఇందు కోసం పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం తెలివైన నిర్ణ‌యం కాకపోవచ్చు. ఒకవేళ మీరు స్వల్ప కాలపరిమితితో రుణం తీసుకున్నట్లైతే, పెద్ద మొత్తంలో ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. సరైన సమయానికి ఈఎమ్ఐ చెల్లించ లేక‌పోతే, అది మీ క్రెడిట్ రిపోర్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే రుణ మొత్తానికి కూడా షరతులు వర్తిస్తాయి. ఉదాహరణకు, కొన్ని బ్యాంకులు కారు పూర్తి ఎక్స్-షోరూమ్ ధరపై రుణాలను ఇస్తే, మరికొన్ని బ్యాంకులు కారు మొత్తం ధ‌ర‌లో 80 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తున్నాయి. కారు రుణం తీసుకునేప్పుడు బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న‌ వ‌డ్డీ రేటు మాత్రమే కాకుండా, దానికి వర్తించే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించడం మంచిది.

* దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను సవరించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో తాజా రుణరేటు 6.95శాతంగా ఉంది. పెంచిన రేట్లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.