* ఏపీలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా 1,941 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,943కి చేరింది.
* సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయం. చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టు. ఈ చట్టవిరుద్ద ఎన్నికలను బహిష్కరించడం సరైందని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి, అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని స్వీకరించి పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికలను ప్రారంభిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. న్యాయస్థానాల మార్గదర్శకాలను దిక్కరించే విధానాన్ని జగన్ రెడ్డి మానుకోవాలి. ఎన్నికల కమీషనర్ చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలి గాని రబ్బరు స్టాంప్ లాగా మారకూడదు. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటి పోయింది. కొత్తగా ఓటర్లు నమోదైన వారికి అవకాశం కల్పించే విధంగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అప్రజాస్వామిక విధానాలతో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు నచ్చిన నాయకులను ఎన్నుకునే విధంగా ఎన్నికలను నిర్వహించాలి. ఎన్నికలను ఒక ఫార్స్ గా మార్చకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపాలి.
* నేడు జరుగుతోన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో..మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తన ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో ఆమెకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ పరిణామం శశికళను తీవ్రంగా బాధించినట్లు సన్నిహితులు వెల్లడించారు. గతంలో చెన్నైలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శశికళకు ఓటు హక్కు ఉండేదని ఆమె తరఫు న్యాయవాది ఎన్ రాజా వెల్లడించారు. అప్పట్లో ఆమె జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్‌లో ఉండేవారు. అయితే తమిళనాడు ప్రభుత్వం దాన్ని స్మారక చిహ్నంగా మార్చడంతో..శశికళకు ఈ పరిస్థితి ఎదురైంది. కాగా తాజా పరిణామం శశికళను తీవ్రంగా బాధించిందని రాజా మీడియాకు తెలిపారు. బాధ్యులైన వారిపై చిన్నమ్మ చట్టపరంగా ముందుకెళ్లనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇందులో ఎలాంటి కుట్ర లేదని, జాబితాలో ఆమె పేరు ఉందో లేదో పరిశీలించుకోవడం ఆమె బాధ్యతని సంబంధిత ఎన్నికల అధికారి తెలిపారు. పేరు తొలగింపుపై ఇంతకు ముందే ఎన్నికల అధికారులను సంప్రదించగా..మార్పులు, చేర్పులకు గడువు ముగిసిందని సమాధానం వచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత స్థానంలో కీలక పాత్ర పోషిస్తారనుకున్న శశికళ..అనూహ్యంగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రకటన ప్రతిఒక్కరిని ఆశ్చర్యపర్చింది. దాంతో తమిళనాడులో అధికారం కోసం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధానంగా ఎన్నికల పోరు నడుస్తోంది. 234 నియోజకవర్గాలకు మంగళవారం ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఆ రెండు పార్టీలతో పాటు కమల్ హాసన్ పార్టీ భవితవ్యాన్ని నేడు ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్
* కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో గల భారత ఆహార సంస్థ కార్యాలయం వద్ద రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎఫ్ సి ఐ ప్రైవేటు పరం చేయడంతో దేశంలో ఆహారభద్రతకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయని పక్షంలో తమ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.
* దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ఇవాళ్టి నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుందని తెలిపింది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాజా ప్రకటనలో తెలిపింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 3548 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల్లో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఒక్క రోజే 15 మంది చనిపోయారు. కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు కేజ్రీవాల్ సర్కార్ దిగింది. రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించేది లేదని, అయితే రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
* జీతాలు, పెన్షన్లు ఇవ్వలేక అప్పులు పుట్టని దీనస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుతాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
* కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్‌కు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. ఇందుకోసం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలు, కీలక ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపు ఈ-మెయిల్ మూడు రోజుల క్రితం ముంబయిలోని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం.
* మంథని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆమెపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణలో భాగంగా ఈ నెల 19న నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శైలజ.. బిట్టు శ్రీనుతో వీడియో కాల్ మాట్లాడించినట్లు అప్పుడు విధుల్లో ఉన్న ఎస్సై ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వారించినా వినకుండా నిందితుడితో ఫోన్ మాట్లాడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మంథని న్యాయస్థానం ఆదేశాలతో సెక్షన్ 186 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* మానసిక ఆరోగ్య సమస్యలను తట్టుకోవడంలో విదేశీయులతో పోలిస్తే భారత క్రికెటర్లు మరింత మెరుగని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్ ఆడటం ఎవరికైనా కష్టమేనని పేర్కొన్నారు. ఏ రంగంలో ఉన్నా ఒడుదొడుకులు తప్పవని స్పష్టం చేశారు. కొవిడ్-19 వల్ల ప్రస్తుతం క్రికెటర్లందరూ బుడగల్లోనే ఉంటూ మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సైతం బాహాటంగానే ఈ విషయాన్ని ఎత్తిచూపాడు.