తానా 2021 ఎన్నికల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు, ప్రతిజ్ఞలు, ప్రసంగాలు, విమర్శలు పోటీ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే ప్రవాసులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. డెట్రాయిట్‌కు చెందిన గోగినేని శ్రీనివాస, నిరంజన్ శృంగవరపు, డీసీకు చెందిన డా.కొడాలి నరేన్‌లు ఈ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. గోగినేని మినహా మిగతా ఇరువురు ప్యానెళ్లు ఏర్పరుచుకుని అమెరికా అంతటా బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఒక ప్యానెల్‌కు మాజీ త్రిమూర్తులు పౌరోహిత్యం చేస్తుండగా, ఇంకొక ప్యానెల్‌ను ఇద్దరు తాజా సేవకులు పల్లకిలో మోస్తున్నారు. ఈ రెండు ప్యానెళ్ల మధ్య విజయం ఎవరిని వరిస్తుందనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం తెలిసింది కేవలం బ్యాలెట్లకు మాత్రమే!
ఈ వారాంతం నిరంజన్ ప్యానెల్ నరేన్ అడ్డా డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా(DMV) రాష్ట్రాల్లో పర్యటన జరుపుతోంది. నరేన్ కోటలో తమ మాట గట్టిగా వినిపించాలని ఈ ప్యానెల్ పావులు కదుపుతోంది. మరోవైపు నరేన్ బృందం నిరంజన్ అడ్డా డెట్రాయిట్‌లో తమ తడాఖా చూపించాలని తహతహలాడుతోంది. ఇరు ప్యానెళ్లు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. దూరపు చుట్టరికాలు, స్నేహరికాలు కలుపుతూ అందరినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు నిర్విరామంగా చేసుకుంటున్నారు. ఇక గోగినేని మాత్రం తన బాణీని సొంతంగా ప్రసార, ప్రచార సాధనాల ద్వారా గట్టిగా వినిపిస్తున్నారు. ఎటువైపుకు మొగ్గని తరాజుని తానేనని, తానాకు తనను రారాజుని చేస్తే సంస్థను తారాజువ్వగా వెలిగేలా చేస్తానని అంటున్నారు.
బుల్లెట్లు దింపటాలు, తొడలు కొట్టడాలు, భుజాలు తడమడాలు, బుజ్జగింపులు, లెక్కలు, చెక్కులు, లీకులు, షాకులు వంటి సోకుల మధ్య తానా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో తెలియాలంటే మే వరకు సహనమే తప్పనిసరి. —సుందరసుందరి(sundarasundari@aol.com)
###################