* జైలు గార్డుల కళ్లలో మిరియాల పొడి చల్లి, వారిని కొట్టి జైలు నుంచి 16మంది ఖైదీలు పారిపోయిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా ఫలోడి సబ్ జైలులో సోమవారం రాత్రి జరిగింది. జైలు మెస్ లో ఉన్న మహిళా గార్డుల కళ్లలో కారం కొట్టడంతో వారు కిందపడి గాయపడ్డారు. అనంతరం జైలు గార్డుల కళ్లలో మిరియాల పొడి చల్లి వారిని కొట్టి 16 మంది ఖైదీలు పారిపోయారు. పారిపోయిన ఖైదీల్లో ముగ్గురు బీహార్ రాష్ట్ర ఖైదీలని, మిగిలిన వారు ఫలోడి, బాప్, లోహవట్ ప్రాంతాలవారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి పారిపోయిన ఖైదీలంతా డ్రగ్స్ కేసులో నిందితులని జైలు అధికారులు చెప్పారు.
* హైదరాబాద్‌లో మరో రేవ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ నగరంలో రేవ్ పార్టీ కల్చర్ కొనసాగుతోనే ఉంది. పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, నాయకులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రేవ్ పార్టీలను నిర్వహించి మందు, విందు, చిందులతో హంగామా సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న పాతబస్తీలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించారు.
* సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ .జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ .11 ఛార్జిషీట్లలో జగన్ ఏ1గా ఉన్నారు .ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేశా .జగన్ నిర్దోషిలా బయటపడాలనే నా ఉద్దేశం .పార్టీని రక్షించుకునే బాధ్యత నాపై ఉంది : ఎంపీ రఘురామకృష్ణమరాజు.
* నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో లంచం డబ్బులు తగలబెట్టిన మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు, తహసీల్దార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలో క్రషర్ ఏర్పాటుకు తహసీల్దార్ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షలు డిమాండ్ చేశారు. వాటిని మధ్యవర్తిగా ఉన్న మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటాయ గౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. ఈ క్రమంలో కల్వరుర్తిలోని విద్యానగర్‌లో ఉన్న తన నివాసం వద్ద వెంకటాయగౌడ్ నగదును తీసుకున్నాడు. ఇదంతా ఏసీబీ అధికారులు చూస్తున్నారనే విషయాన్ని గ్రహించిన వెంకటాయగౌడ్ వెంటనే తన ఇంట్లోకి వెళ్లి లంచంగా తీసుకున్న రూ.6 లక్షల నగదును కాల్చివేశాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని తహసీల్దార్ సైదులు నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
* కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో విద్యార్థుల ఘర్షణ కలకలం రేపింది. ఇంజినీరింగ్ విద్యార్థులు బ్యాట్లు, చైన్లు చేతబూని ఘర్షణకు దిగారు. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారంటూ మూడో సంవత్సరం విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ చంద్ర, తేజ, వంశీ, చరణ్, శివాజీ సహా మరికొందరు నాలుగో సంవత్సరం విద్యార్థులు జూనియర్ల వసతి గృహానికి వెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన క్రికెట్ బ్యాట్లు, సైకిల్ చైన్లు, ఇతర వస్తువులతో మూకుమ్మడిగా దాడి చేశారు. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సీనియర్లు లెక్కచేయకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో గాయపడ్డ మూర్తి, శేషు, రాజు అనే ముగ్గురు జూనియర్లను సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆర్కే వ్యాలీ ఆసుపత్రికి తరలించారు.