రెండు దశాబ్దాలకు పూర్వం జరిగిన ఒక కేసులో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీతోపాటు మరికొంతమందికి కలిపి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5 శాతానికిపైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, పీఏసీ.. వివరాలు అందించడంలో విఫలమైనట్లు సెబీ తాజాగా పేర్కొంది. దీంతో టేకోవర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అంబానీ బ్రదర్స్‌తోపాటు.. ముకేశ్ భార్య నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ, మరికొన్ని సంస్థలపై జరిమానా విధించింది. వారంట్లతో కూడిన రీడీమబుల్ డిబెంచర్ల ద్వారా ఆర్‌ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ.. 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను సొంతం చేసుకున్నాయి. 5 శాతం వాటాకు మించిన ఈ లావాదేవీని టేకోవర్ నిబంధనల ప్రకారం 2000 జనవరి 7న కంపెనీ పబ్లిక్‌గా ప్రకటించవలసి ఉన్నట్లు సెబీ పేర్కొంది. అయితే ప్రమోటర్లు, పీఏసీ ఎలాంటి ప్రకటననూ విడుదల చేయలేదని తెలియజేసింది. వెరసి టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించారని సెబీ ఆరోపించింది. కాగా.. పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా చెల్లించవచ్చని సెబీ తెలియజేసింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవడం ద్వారా 2005లో ముకేశ్, అనిల్ విడివడిన సంగతి తెలిసిందే.
21ఏళ్ల కిందటి కేసులో ₹25కోట్ల జరిమానా
Related tags :