Business

స్కోడ కార్లపై భారీ తగ్గింపు ధరలు-వాణిజ్యం

Business News - Huge Discounts On Skoda Cars

* సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోనున్నాయి. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి దిగుమతులు పెంచుకోవడంపై భారత్‌ దృష్టి సారించడం ఇందుకు నేపథ్యం. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా చమురుకు గిరాకీ తగ్గుతున్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నందున, మే నెలలో చమురుకు గిరాకీ తగ్గుతుందన్న అంచనాలున్నాయి.

* ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ స్కోడా గతేడాది జరిగిన 2020 ఆటో ఎక్స్​పోలో ఆక్టేవియా ఆర్ ఎస్245 పెర్ఫార్మెన్స్​ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రారంభంలో కేవలం 200 యూనిట్లను మాత్రమే భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. అయితే, కరోనా కారణంగా ఈ కార్ల ఆర్డర్లు రద్దయ్యాయి. దీంతో, ఇవి ఆయా డీలర్​షిప్​ సెంటర్లలోనే మిగిలిపోయాయి. ఈ స్టాక్​ క్లియర్​ చేసుకునేందుకు ఇప్పుడు భారీ ఆఫర్​ను ప్రకటించింది స్కోడా కంపెనీ. ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 245 వేరియంట్​పై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్​ను ప్రకటించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆర్‌బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు స్టాక్‌మార్కెట్‌కు‌ మాంచి బూస్ట్‌లా పనిచేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగానే ఉన్న కీలక సూచీలు ఆ తరువాత మరింత జోష్‌గా కొనసాగాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటన తర్వాత సూచీ ఒక్కసారిగాపైకి ఎగిసింది. సెన్సెక్స్ చివరకు 460 పాయింట్ల లాభంతో 49,661 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆఖరుకు 135 పాయింట్లు లాభపడి 14,819 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.38 వద్ద ముగిసింది.

* బంగారం ధర గత ఏప్రిల్ 1 నుంచి వరుసగా పెరుగుతుంది. ఈ లెక్క చాలు బంగారం ధరలు పెరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవడానికి. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధర కూడా పెరుగుతూ పోతుంది. కేవలం ఏడూ రోజుల్లోనే బంగారం ధర రూ.1000 పెరగడం విశేషం. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,421 నుంచి రూ.45,904కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,606 నుంచి 42,048కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.442 రూపాయలు పెరిగింది అన్నమాట.

* ఈ ఏడాది భారత వృద్ధి ఆకర్షణీయంగా 12.5 శాతం నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేస్తోంది. గతేడాది కరోనాలోనూ సానుకూల వృద్ధి సాధించిన ఏకైక దేశం చైనా కంటే ఈ వృద్ధి ఎక్కువ కావడం విశేషం. ప్రపంచ బ్యాంకుతో సమావేశానికి ముందు వార్షిక ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’ అంచనాలను ఐఎమ్‌ఎఫ్‌ వెలువరచింది.