ఒక్కోసారి యథాలాపంగా అన్న మాట కోసం డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘సెక్రెటరీ’ వంద రోజుల వేడుకలో నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ, ‘రామానాయుడి బ్యానర్‌లో నాలాంటి నటుడు హీరోగా నటించినా సూపర్ హిట్ అవుతుంది’ అన్నారట. వెంటనే రామానాయుడు ‘హీరో కావాలన్న కోరిక ఉంటే చెప్పండి. తప్పకుండా తీస్తాను’ అని యథాలాపంగా అన్నారట. ఆ సంగతిని ఆయన అప్పుడే మరచిపోయినా సత్యనారాయణ మాత్రం మరచిపోలేదు. సురేష్ సంస్థలో తాను హీరోగా నటిస్తున్నానంటూ పాత్రికేయులకు చెప్పేశారు. అక్కడ కట్ చేస్తే సురేష్ సంస్థ నిర్మించిన ‘సావాసగాళ్లు’లో తమిళ నటుడు నగేష్ హాస్య పాత్ర ధరించారు. అది దర్శకుడు బోయిన సుబ్బారావుకి తొలి చిత్రం కావడంతో నగేష్ ఆయనకి సలహాలివ్వడం మొదలుపెట్టారట. అప్పుడు రామానాయుడు ‘కొత్త దర్శకుణ్ని కంగారు పెట్టొద్దు. దర్శకత్వం చేయాలని ఉత్సాహం ఉంటే చెప్పండి నేనే అవకాశం ఇస్తాను’ అని మాట వరసకి అన్నారట. నగేష్ కూడా రామానాయుడి మాటల్ని సీరియస్‌గా తీసుకుని ఓ కథ వినిపించి, దర్శకుడిగా అవకాశం ఇమ్మన్నారట. ఒక వైపు హీరో పాత్ర కోసం సత్య నారాయణ, మరో వైపు దర్శకత్వం కోసం నగేష్ వెంటపడుతుంటే యథాలాపంగా అన్న మాట కోసం నిలబడి ఆ ఇద్దరితోనూ ‘మొరటోడు’ చిత్రం నిర్మించారు రామానాయుడు. అది దెబ్బతింది. నష్టాల లెక్క తేలిన తరువాత ‘ఇద్దరికిచ్చిన మాట ఖరీదు అయిదు లక్షల రూపాయలు’ అంటూ చమత్కరించారట రామానాయుడు.
రామానాయుడికి ₹5లక్షల నష్టం
Related tags :