* యాభై కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం లీక్ అయిన విషయం ఇంకా మరువక ముందే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. ప్రొఫెషనల్ సోషల్ మీడియాగా చెప్పుకునే లింక్డ్‌ఇన్ యూజర్ల వివరాలు సైతం తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయినట్లు సమాచారం. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్ చేసిన సదరు సైబర్ నేరగాడు.. దాన్ని ఓ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్ అనే వార్తా సంస్థ పేర్కొంది.
* బీఎండబ్ల్యూ ఆధునికీకరించిన 6 సిరీస్ సెడాన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.67.9 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్ రకం 630ఐ ఎం స్పోర్ట్ ధర రూ.67.9 లక్షలు కాగా.. డీజిల్ రకం 630డి ఎం స్పోర్ట్ ధర రూ.68.9 లక్షలు, బీఎం 620డి లగ్జరీ లైన్ ధర రూ.77.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 630ఐ రూపొందింది. ఇది 258 హెచ్‌పీ సామర్థ్యంతో 6.5 సెకన్లలోనే 100 కి.మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన 620డి 190 హెచ్‌పీ సామర్థ్యంతో 7.9 సెకన్లలో 100 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. 3-లీటర్ 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన 630డి 265 హెచ్‌పీ సామర్థ్యంతో 6.1 సెకన్లలో 100 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.
* ఈ ఏడాది మార్చిలో ప్రయాణికుల వాహన రిటైల్ విక్రయాలు 27.39 శాతం పెరిగి 2,79,745 కు చేరాయి. 2020 మార్చిలో 2,17,879 వాహనాలను కంపెనీలు విక్రయించాయని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) వెల్లడించింది. దేశంలోని 1482 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (ఆర్‌టీఓ) 1277 ఆర్‌టీఓల నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ సమాచారం ప్రకారం.. ద్విచక్ర వాహన విక్రయాలు మార్చిలో 35.26 శాతం క్షీణించి 11,95,445కు, వాణిజ్య వాహనాలు 42.2 శాతం తగ్గి 67,372కు, త్రిచక్రవాహనాల అమ్మకాలు 50.72 శాతం క్షీణతతో 38,034కు పరిమితమయ్యాయి. ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం 29.21 శాతం పెరిగి 69,082కు చేరాయి. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి విక్రయాలు 23,11,687 నుంచి 28.64 శాతం క్షీణతతో 16,49,678కు చేరాయి.‘సుమారు 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిపై కొవిడ్-19 ప్రభావం చూపింది. ఇంధనం, వాహనాల ధరలు పెరగడం వల్ల కూడా వాహనాల కొనుగోలు తగ్గింద’ని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి అభిప్రాయపడ్డారు.
* దేశంలో ప్రత్యక్ష పన్ను రూపంలో ఆదాయం అంచనాకు మించి లభించింది. ‘‘2020-21 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా నికరంగా ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో వృద్ధి సాధించాం’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్ ప్రమోద్ చంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. ఈ సారి ప్రత్యక్ష పన్నుల ఆదాయం మార్చి 31నాటికి నికరంగా రూ. 9.45 లక్షల కోట్లు సమకూరింది. ఇది గత బడ్జెట్‌లో సవరించిన అంచనాల కంటే 5శాతం ఎక్కువ.