* సముద్ర జలాల్లో ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మత్య్స ఉత్పత్తులను వేటను ప్రభుత్వం నిలిపివేసింది.మొత్తం 61రోజుల పాటు చేపలవేట నిషేధం అమల్లోకి ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన సీఎంగా జగన్ రికార్డులకెక్కారని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
* దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,31,968 మంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 780 మంది బలయ్యారు.
* ఔరంగాబాద్‌లో గ్రామీణ ప్రాంతల నుంచి కొవిడ్ రోగులను తరలించేందుకు ఉపయోగిస్తోన్న ఓ అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. జ్వాలలతో ఆ వాహనం పేలి తునాతునకలైంది.
* వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రమైన విషయం.. ఉత్సవం కాదు: రాహుల్ గాంధీ.ప్రధాని ‘టీకా ఉత్సవం’ వ్యాఖ్యలపై మండిపాటు.మనకే లేనప్పుడు ఎగుమతి ఎందుకని ప్రశ్న.దేశ ప్రజలను ప్రమాదంలో పడేయడం భావ్యమా? అని నిలదీత.అందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్.దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడడం చాలా తీవ్రమైన విషయమని, అది ఉత్సవం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.ఈ నెల 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవం’ నిర్వహిస్తామని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.టీకాలు మనకే సరిపోనప్పుడు విదేశాలకు ఎగుమతి చేయడమేంటని ప్రశ్నించారు.
* సంక్షోభంలో ‘వకీల్ సాబ్’ లాంటి భారీ చిత్రాలకు పైరసీ పీడ కూడా తప్పటం లేదు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన పవర్ స్టార్ మూవీకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ, ఇంతలోనే మూవీరూల్జ్, టెలిగ్రామ్ లాంటి వెబ్ సైట్స్ లో ‘వకీల్ సాబ్’ ఫుల్ లెంగ్త్ మూవీ ప్రత్యక్షం కావటం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది.
* కృష్ణా జిల్లాలో కరోనా సోకిన రోగులకు అనుమతి లేకుండా వైద్య సేవలు అందించే ఆసుపత్రుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు ఏ.యండి . ఇంతియాజ్ హెచ్చరించారు .
* ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయా ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రకటించిన నార్వే ప్రధాన మంత్రే, వాటిని ఉల్లంఘించింది. దీంతో ఆమెకు అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు.
* ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31,892 నమూనాలను పరీక్షించగా 2,765 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది.
* జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ చెత్త వైరస్‌ను తప్పించుకునేందుకు ఏడాది కాలంగా నా వంతు కృషి చేశా. ఎంతో జాగ్రత్తగా ఉన్నా. కానీ చివరకు వైరస్ నన్ను పట్టేసుకుంది. నేడు నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేవు. అయితే వైద్యుల సూచన మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నా’’ అని ట్వీట్ చేశారు.
* ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని అంచనా వేయగా.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లును మంత్రులు ఆదేశించారు.
* కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు.ఆ నాలుగు రోజులు కనీసంగా 24లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న సీఎం.. దీని కోసం అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కొవిడ్ వ్యాక్సిన్‌పై సమీక్షించిన సీఎం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
* నెట్‌వర్కింగ్‌లో వైర్‌లెస్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సౌకర్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తున్న కామ్‌స్కోప్ సంస్థకు సీఐవో (చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్)గా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45) నియమితులయ్యారు. గత 12 ఏళ్లకాలంలో ఆయన సంస్థలో డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. కామ్‌స్కోప్‌లో 50 మంది సాంకేతిక నిపుణుల్లో ముఖ్యుడిగా ఉండటంతో సీఐవోగా అరుదైన గౌరవం లభించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ పత్రిక ప్రచురించింది.
* ‘‘టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే పింఛన్ తీసేస్తామని ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారంట.. ఒక్కరి పింఛన్ తీసేసినా ఈ ప్రభుత్వాన్నే ఊడదీస్తా’’ అని సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని బట్టుగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఉన్న భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేని చేతగాని ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలందరినీఅరాచకవాదులుగా తయారుచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
* టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి జీవితమంతా మేనేజ్ చేయడమేనని, ఎన్టీఆర్, మోదీ, పవన్ కాళ్లు పట్టుకుని సీఎం అయిన చరిత్ర బాబుదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల నుంచి పారిపోయిన చరిత్ర చంద్రబాబుదంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్జీమర్స్ వచ్చింది ప్రజలకు కాదు.. చంద్రబాబుకు అని ఎద్దేవా చేశారు.
* బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విండ్సర్ కాజిల్ లో శుక్రవారం ఫిలిప్ తుదిశ్వాస విడిచారని తెలిపింది. ఈ విషయాన్ని గురించి రాయల్ ఫ్యామిలీలోని ఇతర సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయాలని ప్రకటించింది. కాగా ప్రిన్స్ ఫిలిప్ 1921, జూన్ 10న కార్ఫు ద్వీపంలో జన్మించారు. 1947 లో యువరాణి ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. ప్రిన్స్ ఫిలిప్,రాణి దంపతులకు నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవరాళ్ళు 10 మంది మునిమనవళ్లు ఉన్నారు.