తానా అధ్యక్ష పదవి ఓ పవిత్ర పీఠమని దానిని అధిరోహించేవారు తానా సభ్యులకే గాక అమెరికాలోని తెలుగువారికి కూడా ప్రతిబింబమని అలాంటి పదవిలో ఉండి తలదించుకునే పనులు చేయడం సిగ్గుచేటని తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న నిరంజన్ శృంగవరపు అన్నారు. శుక్రవారం సాయంత్రం కూకట్ల శ్రీనివాస్ నేతృత్వంలో మేరీల్యాండ్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తాను ఏనాడు తలదించుకునే పని చేయలేదని అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా అలాంటి ఆలోచన కూడా దరిచేరనివ్వనని ఆయన అన్నారు. తాను తానా ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కోవిద్ సమయంలో లక్షమందికి సరుకులు, 3లక్షల మందికి భోజనాలు, 10లక్షలకు పైగా మాస్కులు అందజేసిన వైనాన్ని వివరించారు. నిరంజన్ ప్యానెల్ అంటేనే యువతరానికి చిహ్నమని, పనిచేసే వారు ఎవరైనా ధైర్యంగా గాడ్‌ఫాదర్ల మద్దతు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని నిరూపించడమే తమ నినాదం TANA4CHANGE అని ఆయన తెలిపారు.
తానా ఎల్లప్పుడూ ప్రవాసులదే గాక ఇక్కడే పుట్టి పెరిగిన ప్రవాస తరానిది కూడా అని, అందుకే సంస్థలో జవాబుదారీదనం, పారదర్శకతలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక అక్రమాల నివారణకు తనను గెలిపిస్తే డిజిటలైజేషన్‌కు కృషి చేస్తానని పేర్కొన్నారు. కోశాధికారి అభ్యర్థి అశోక్ మాట్లాడుతూ ప్రత్యర్థి ప్యానెల్ వారు ఎందుకింత చిన్నవయస్సులో పెద్ద పదవుల కోసం ఆవేశపడుతున్నావని ప్రశ్నిస్తున్నారని వారికి తన సమాధానం – పనిచేయడానికి కావల్సింది మనస్సు గానీ వయస్సు కాదని అన్నారు. ఎలికాట్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, నిరంజన్ ప్యానెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనిత, రామ్ , జగదీష్‌లు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
############