ప్రస్తుతం అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తానాలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం జరుపుకొంటున్నాయి. ఈ నేపధ్యంలో తానా ఎన్నికల అధికారిగా నియమితులైన ఐనంపూడి కనకంబాబు ఎన్నికల నిర్వహణకు సంబంధించి TNILIVE.COM డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తానా ఎన్నికల నిర్వహణకు కనకంబాబుకు సహాయ అధికారులుగా నియమితులైన కోనేరు ఆంజనేయులు, ముత్యాల రాజాచౌదరిలతో కలిపి TNIకు కనకంబాబు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు విషయాలను వివరించారు.
*** 18వేల కుటుంబాలు – 34వేల ఓటర్లు
ప్రస్థుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో 34వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొంటున్నారని, మొత్తం 18వేల కుటుంబాల్లో ఈ ఓటర్లు ఉన్నారని కనకంబాబు తెలిపారు. ఓటర్లందరికీ 15వ తేదీ నుండి బ్యాలెట్ పత్రాలు పోస్టల్ శాఖ ద్వారా పంపటం జరుగుతుందని వచ్చే 25వ తేదీ నాటికి ఓటర్లు అందరికీ బ్యాలెట్లు అందే విధంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మే 28వ తేదీ వరకు తానా సభ్యుల నుండి ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను స్వీకరించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*** నలుగురు అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాం
తమపై నమ్మకంతో ఎన్నికల అధికారులుగా ఎన్నుకొన్నందుకు తానా బోర్డుకు, తానా సభ్యులకు కనకంబాబు కృతఙతలు తెలిపారు. తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. ప్రస్థుత పరిస్థితుల్లో తానా ఎన్నికల నిర్వహణ ఒక సవాలు వంటిదని ఆయన తెలిపారు. గతంలో తానాలో ఇంత పెద్ద ఎత్తున పోటీ జరగలేదని దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణను పటిష్టవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల సందర్భంగా నాలుగు నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వీరిలో అమిరినేని కిరణ్ అనే అభ్యర్ధి సరియైన పత్రాలు చూపించడంతో పాటు తానా బోర్డు దానిని ధృవీకరంచడంతో ఆయన అభ్యర్ధిత్వాన్ని కొనసాగించినట్లు తెలిపారు. కార్యదర్శి పదవికి పోటీ చేసిన భక్తా భల్లా రెండవ పదవిలో కొనసాగుతూ నామినేషన్ వేసినందున దానిని తిరస్కరించామని తెలిపారు. కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన వేమూరి సతీష్‌పై క్రిమినల్ కేసు ఉన్నట్లు అభ్యంతరాలు వచ్చాయని, దానికి సంబంధించిన సరియైన పత్రాలు చూపించలేకపోయినందున ఆయన అభ్యర్ధిత్వాన్ని ఆమోదించామని తెలిపారు. వేమూరి సతీష్‌కు క్రిమినల్ కేసులో శిక్ష పడలేదని తాము జరిపిన పరిశీలనలో వెల్లడి అయినట్లు కనకంబాబు తెలిపారు. మరొక అభ్యర్ధి రామిశెట్టి సుమంత్ రెండు నామినేషన్లు వేయడంతో ఆయన నామినేషన్ చెల్లుబాటు కాలేదని తెలిపారు. కానూరు హేమచంద్ర అనే అభ్యర్ధి నామినేషన్ కూడా నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఆయన నామినేషన్ కూడా చెల్లుబాటు కాలేదని తెలిపారు. నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి కోర్టుల నుండి తమకు ఇప్పటి వరకు ఏ విధమైన నోటీసులు అందలేదని తెలిపారు.
*** మే 29న ఫలితాల వెల్లడి
బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రక్రియను సియాటెల్‌లోని ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించామని ఆ సంస్థ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పత్రాలను మేయిల్ చేయడం, ఓటర్ల నుండి పత్రాలను తిరిగి స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మే 29వ తేదీ ఉదయం నుండి స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రానికే ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని వెంటనే ఫలితాలు వెల్లడి అవుతాయని భావిస్తున్నట్లు కనకంబాబు తెలిపారు. తాము ఓట్ల లెక్కింపుకు పరిశీలకులుగా మాత్రమే హాజరవుతామని, పోటీలో ఉన్న అభ్యర్ధుల తరపున ఒక్కొక్కరినీ మాత్రమే లెక్కింపు సందర్భంగా అనుమతిస్తామని వీరు గ్యాలరీలో ఉండే ఓట్ల లెక్కింపును పరిశీలించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
####################