ఖమ్మం సంకల్స సభలో షర్మిల ఉద్విగానికి గురయ్యారు. ‘జోహార్ వైఎస్సార్.. జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని షర్మిల ప్రారంభించారు. ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం అని కొనియాడారు. ‘‘వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండెకు నమస్కారం. 18 ఏళ్ల క్రితం ఇదే రోజు వైఎస్ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్నారు. ఏ నాయకుడు చేయని సాహసం వైఎస్సార్ చేశారు. ప్రజలతో మమేకమైన మహానేత వైఎస్సార్. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. రాజన్న అడుగుజాడల్లో నడుస్తాను. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను. రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను. పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందో కూడా వివరిస్తాను. వ్యవసాయాన్ని పండుగ చేయాలని వైఎస్ కోరుకున్నారు. వైఎస్.. లక్షలాది మంది రైతుల్ని రుణ విముక్తుల్ని చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఖమ్మం నుంచి ప్రజలతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చిందని వైఎస్ విజయమ్మ అన్నారు. షర్మిలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలతో తమకున్న అనుబంధం చెరిగిపోనిదని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ని నాయకుడిగా నిలబెట్టిన ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంది అని పేర్కొన్నారు. వైఎస్సార్ లేరన్న వార్తతో అనేక గుండెలు ఆగిపోయాయని గుర్తుచేశారు. ఖమ్మం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని మాట్లాడారు. ‘‘ వైఎస్సార్ మనిషిని మనిషిగానే ప్రేమించారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సంక్షేమ ఫలాలు అందించారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించిన దమ్మున్న నాయకుడు వైఎస్సార్. వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం. కరెంటు బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఏవీ పెంచలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి మేలు చేశారు. ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే అయినా వైఎస్‌ఆర్ చలవే. నా బిడ్డ షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి’’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.