* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 480వ రోజుకి చేరుకున్నాయి.మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు.రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు అంటున్నారు.రాజధాని రైతులు కరోనా సూచనలు పాటిస్తూ నిరసనలు చేస్తున్నారు.విశాఖ ఉక్కు సాధిస్తామంటూ..విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.
* తమిళనాడు ప్రజలు డీఎంకే పార్టీకే పట్టం కట్టబోతున్నట్టు సర్వేలు అంటున్నాయి. మెజారిటీ ప్రజలు ఉదయిస్తున్న సూర్యుడి గుర్తుకే ఓటేసినట్టు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు అత్తెసరు సీట్లు కట్టబెట్టబోతున్నారట! ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదట! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ అయ్యింది.. పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగింది. ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే డీఎంకే అధికారంలోకి రావడం పక్కా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో డీఎంకే ఈజీగా 180 స్థానాలు గెల్చుకుంటుందని ఐ బ్యాక్ సంస్థ చెబుతోంది.
* తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ప్రజలు అశ్రద్ధ చూపుతుంటే, పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే మహమ్మరాని అడ్డుకోగలమని ఇప్పటికే వారం రోజుల పాటు ప్రచారం చేసిన హైదరాబాద్ పోలీసులు, ఇప్పుడిక మాస్క ధరించకుండా కనిపిస్తే, రూ. 1000 జరిమానాగా విధిస్తున్నారు. నిత్యమూ ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ, మాస్క్ లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
* ఏపీ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి.గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపు అయింది.మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్ కోరలు చాస్తోంది.
* నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలకు పైగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు రైతులు.
* హైకోర్టు ఉద్యోగుల సంఘం అభ్యర్ధన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఈ నెల 12న హైకోర్టుకు సెలవు ప్రకటించారు.
* ఏపీలో వకీల్ సాబ్ సినిమా వ్యవహారం రాజకీయంగా దూమారం రేపుతోంది.బీజేపీ, వైసీపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.అయితే, తాజాగా వకీల్‌సాబ్‌కు మరో షాకిచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది.మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది.ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు.
* ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని పీఎస్ ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
* ఏపీలో సెలవులతో 4 రోజులు ఆఫీసులు బంద్.. ఉగాదికి ఫుల్ ఖుషీ.ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు రానున్నాయి.ఈరోజు (రెండో శనివారం), 11న (ఆదివారం), 13న (ఉగాది), 14న (అంబేడ్కర్ జయంతి) కావడంతో నాలుగు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కానున్నాయి.
* దేశంలో కరోనా వైరస్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మదమెక్కిన ఈ ప్రభుత్వానికి మంచి మాటలు గిట్టవని మండిపడ్డారు.
* తిరుపతి ఎన్నికల ప్రచార సభ రద్దు చేసుకుంటున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతి పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు సీఎం మరో లేఖ రాశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరి పర్యటన రద్దు చేసినట్లు వెల్లడించారు.