Movies

తమన్నా ఎగ్జైట్‌మెంట్

తమన్నా ఎగ్జైట్‌మెంట్

‘‘ఓటీటీలో పరిమితులు ఉండవు.. చెప్పాలనుకున్నది చెప్పొచ్చు. నటీనటులకు కూడా ప్రయోగాలు చేసే స్వేచ్ఛ దొరుకుతుంది’’ అని హీరోయిన్‌ తమన్నా అన్నారు. తమన్నా లీడ్‌ రోల్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లెవన్త్‌ అవర్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ సిరీస్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 9) ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తమన్నా మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘నవంబర్‌ స్టోరీ’ అనే వెబ్‌ సిరీస్‌ చేశా. తెలుగులో ‘లెవెన్త్‌ అవర్‌’ అవకాశం వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యా. పురుషాధిక్య కార్పొరేట్‌ ప్రపంచంలో ఓ మహిళా సీఈఓ తన కంపెనీని ఎలా కాపాడుకుంది? అనే నేపథ్యంలో సాగే కథ ఇది. నా జీవితం ప్రతిరోజూ ‘లెవెన్త్‌ అవర్‌’లా బిజీబిజీగా ఉంటుంది. అందుకే ఈ సిరీస్‌ నా మనసుకి బాగా దగ్గరైంది. హీరోయిన్‌గా సుదీర్ఘ ప్రయాణంలో కమర్షియల్‌ పంథాలో విభిన్నమైన పాత్రలు చేశాను. సినిమాల్లో దర్శకుల సూచనలకు అనుగుణంగానే పనిచేయాలి.. కానీ వెబ్‌ సిరీస్‌లో స్వేచ్ఛ ఉంటుంది.. నటనకి మంచి అవకాశం ఉంటుంది. ‘బాహుబలి’ లాంటి పెద్ద స్కేల్‌ ఉన్న సినిమా చేసిన మీరు ఇప్పుడు ‘లెవెన్త్‌ అవర్‌’లాంటి బిగ్గెస్ట్‌ స్కేల్‌ వెబ్‌ సిరీస్‌ చేశారు అని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అనే భేదాలు నాకు లేవు.. నా దృష్టిలో పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఆలోచన ఉండదు.. మంచి సినిమా అనేది మాత్రమే ఉంటుంది. నేను నటించిన ‘సీటీమార్‌’, ‘మాస్ట్రో’, ‘ఎఫ్‌ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘నవంబర్‌ స్టోరీస్‌’ విడుదలకు సిద్ధమవుతున్నాయి’’ అన్నారు.