సేవా సంస్థలకు ఎన్నికలు ఎప్పటికీ ప్రమాదకరం కాదని ఓ రకంగా చెప్పాలంటే ప్యానెళ్లుగా ఏర్పడే సభ్యులకు పరస్పర అనుభవాల మార్పిడికి తద్వారా ఆలోచనలపై విస్తృత చర్చకు అవకాశం దొరుకుతుందని తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డా.నరేన్ కొడాలి అన్నారు. ఆదివారం సాయంత్రం డెట్రాయిట్ ప్రవాసులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. 15ఏళ్ల అనుభవాలను ఒకరికొకరం పంచుకునేందుకు ఈ ఎన్నికల ప్రయాణం తోడ్పడుతోందని తమలో తాము తానాకు ఏమి చేయాలనే దానిపై ఇంకా లోతైన విచారణ చేసుకుని అందరి సంఘటిత అంగీకారంతో అమలు చేస్తామని అందువలనే తాము ముందస్తు వాగ్దానాలు చేయమని ఆయన అన్నారు. తన ప్యానెల్ సభ్యులను సభకు పరిచయం చేసి తానాతో తన అనుబంధం గురించి వివరించారు. డెట్రాయిట్ స్థానికుడు పంత్ర సునీల్ తమ ప్యానెల్‌కు బలమని అతని గెలుపుపై తమకు సందేహం లేదని అన్నారు. సభికులను తమ ప్యానెల్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తికి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
####################