Business

వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్న బ్యాంకులు-వాణిజ్యం

వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్న బ్యాంకులు-వాణిజ్యం

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు నగదు నిల్వ అవసరం లేని (జీరో బ్యాలెన్స్‌) ఖాతాలు తెరుస్తూనే, వివిధ సేవల పేరిట ఆయా ఖాతాదార్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఐఐటీ-బాంబే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్‌ లేదా బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ ఖాతాదారులు (బీఎస్‌బీడీఏ) ఒక నెలలో నాలుగు లావాదేవీలు నిర్వహించాక, తదుపరి ప్రతి నగదు ఉపసంహరణకు వారి నుంచి బ్యాంక్‌ రూ.17.70 చొప్పున వసూలు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. సుమారు 12 కోట్ల మంది బీఎస్‌బీడీఏ ఖాతాదారుల నుంచి 2015-20 మధ్య ఎస్‌బీఐ ఛార్జీల రూపేణ రూ.300 కోట్లకు వసూలు చేసినట్లు వెల్లడైంది. 2018-19లో రూ.72 కోట్లు, 2019-20లో రూ.158 కోట్లు ఇలా వసూలు చేసినట్లు ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ ఆశిష్‌ దాస్‌ వెల్లడించారు.

* కరోనా భయాలు స్టాక్‌మార్కెట్లను కమ్మేశాయి. లాక్‌డౌన్‌ వార్తలతో సూచీలు బేజారయ్యాయి. ఒక్క రోజులో 3శాతానికి పైగా పతనమయ్యాయి. ఫలితంగా మదపర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటం, మహారాష్ట్రలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న వార్తలతో దేశీయ మార్కెట్లు సోమవారం బేర్‌మన్నాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ ఉదయం 48,956 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ కాసేపటికే 1400 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడేలో 47,693 వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ చివరకు కాస్త కోలుకున్నా భారీ నష్టం తప్పలేదు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1707.94(3.44శాతం) పాయింట్లు కుంగి 47,883.38 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 524.10(3.53%) పాయింట్లు దిగజారి 14,310.80 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9శాతానికి పైగా కుంగిపోగా.. ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, లోహ రంగ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి.

* ప్ర‌స్తుతం బంగారు రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవ‌ల‌సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి.చాలా బంగారు రుణ సంస్థ‌లు ఒక సంవ‌త్స‌రం కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు బంగారు రుణాల‌ను అందిస్తుండంగా, కొన్ని బ్యాంకులు రుణ గ్ర‌హీత‌ల‌ను కాల‌వ్య‌వ‌ధి పొడిగించ‌డానికి అనుమ‌తిస్తాయి. బంగారం రుణాల‌పై వ‌డ్డీ రేట్లు కొన్ని రుణ సంస్థ‌లు త‌క్కువ తీసుకుంటుంటే, కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాయి.కొన్ని నెల‌లుగా బంగారు రుణాల‌కు డిమాండ్ పెరిగింది. చిన్న వ్యాపారులు కూడా త‌మ వ్యాపారాల‌లో న‌గ‌దు ప్ర‌వాహానికి ఈ రుణాలు తీసుకుంటున్నారు.గ‌డిచిన డిసెంబ‌ర్ త్రైమాసికంలో ఫెడ‌ర‌ల్ బ్యాంక్ లో బంగారు రుణాలు 67% పెరిగాయి.

* మిశ్రమ సంకేతాలు, బాండ్‌లపై ప్రతిఫలాలు పెరుగుతున్న నేపథ్యంలో గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పులు చేయకపోవడం, కొవిడ్‌-19 కేసుల విజృంభణతో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించడం, వ్యాక్సిన్‌ కొరత తలెత్తొచ్చన్న వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 2.9 శాతం తగ్గి 63 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి
74.7కు బలహీనపడింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.9 శాతం నష్టంతో 49,591 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.2 శాతం తగ్గి 14,835 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.2340 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1154 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.929 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈక్విటీల్లో రూ.740 కోట్లు, డెట్‌ విభాగంలో రూ.189 కోట్లు మేర వెనక్కి తీసుకున్నారు.

* ఏప్రిల్ 1 నుంచి ప్రతి రోజూ పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగారం పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,554 నుంచి రూ.46,375కు పడిపోయింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ42,643 నుంచి 42,480కు చేరుకుంది.