Politics

నూతన ఎన్నికల కమీషనర్‌గా సుశీల్‌చంద్ర-తాజావార్తలు

నూతన ఎన్నికల కమీషనర్‌గా సుశీల్‌చంద్ర-తాజావార్తలు

* దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర నియమితులు కానున్నారు.కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ.దీనిని అనుసరించి ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను సీఈసీగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత సీఈసీ సునీల్‌ అరోడా పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది.అరోడా స్థానంలో సుశీల్‌ ఈ నెల 13న పదవీ బాధ్యతలు చేపడతారు.వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

* దాదాపు పద్దెనిమిది నెలల విరామం అనంతరం గోదావరి నది పాపికొండల అందాలను వీక్షించే అవకాశం లభించనుండడంతో పర్యాటక ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2019 సెప్టెంబర్‌ 15న తూర్పు గోదావరిజిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడంతో గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్‌ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోటు నడపనున్నారు. కాగా, రాజమహేంద్ర వరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే అదికూడా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

* దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న కొత్త‌గా 1,68,912 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న‌ 75,086 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 904 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,70,179కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. 12,01,009 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,45,28,565 మందికి వ్యాక్సిన్లు వేశారు.

* సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని.. ఆయన్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇదే చివరి హెచ్చరికని తేల్చి చెప్పారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని భాజపాను ప్రశ్నించారు. ఉగాదికి ఒకరోజు ముందే నగరానికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు.

* తెలంగాణలో బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతలు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫారసుల మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనలను సవరించింది. బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ చేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్‌తో పాటు బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ ప్రవేశపరీక్ష రాయొచ్చు.

* తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నినాదమైన ‘మా, మాతి, మనుష్’ను మరిచిపోయిన మమతా బెనర్జీ.. ‘మోదీ’ జపం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో అధికారం కోల్పోయిన వామపక్షాలు మళ్లీ తిరిగి అధికారంలోకి రాలేరనే విషయం దీదీకి తెలుసని.. అదే పరిస్థితి ఆమెకు కూడా ఎదురవుతుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్దమాన్ నియోజకవర్గంలో పర్యటించిన మోదీ.. ఓటమి భయంతోనే మమతా బెనర్జీలో అసహనం పెరిగిందన్నారు.

* చైనా స్టైలే వేరు.. ఏది చేసినా ఓపిగ్గా.. విభిన్నంగా చేస్తుంది. గూఢచర్యం కూడా అంతే.. అందుబాటులో ఉన్న ప్రతి వనరును వినియోగిస్తుంది. అందుకే అమెరికా సీఐఏ వలేనో.. ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ల తరహాలో చైనా గూఢచర్య సంస్థల పేర్లు బయట వినపడవు.. కానీ, చాపకింద నీరులాగా సమాచారం మాత్రం సరిహద్దులు దాటేస్తుంది. తాజాగా గ్రీకు పత్రిక పెంటాపోస్టాగ్మా చైనా గూఢచర్యంలోని ఓ భాగాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనా ‘వెయ్యి ఇసుక రేణువులు’ (థౌజండ్‌ గ్రెయిన్స్‌ ఆఫ్‌ శాండ్‌) విధానంలో సమాచార సేకరణ చేస్తుందని వెల్లడించింది.

* భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు.

* కరోనా భయాలు స్టాక్‌మార్కెట్లను కమ్మేశాయి. లాక్‌డౌన్‌ వార్తలతో సూచీలు బేజారయ్యాయి. ఒక్క రోజులో 3శాతానికి పైగా పతనమయ్యాయి. ఫలితంగా మదపర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటం, మహారాష్ట్రలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న వార్తలతో దేశీయ మార్కెట్లు సోమవారం బేర్‌మన్నాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే భారీ నష్టాల్లో కూరుకుపోయాయి.

* కరోనా కట్టడికి ప్రధాన ఆయుధమైన మాస్కును వాడిన వెంటనే మూత ఉన్న చెత్తడబ్బాలో వేయాలనేది నిపుణుల సూచన. అవన్నీ మాకెందుకు వాటితో కూడా మేం వ్యాపారం చేస్తామంటుంది ఓ పరుపుల తయారీ సంస్థ. అందుకే పరుపులను నింపేందుకు పత్తికి బదులు.. వాడిన మాస్కులను వినియోగిస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో పారిశ్రామిక వాడలోని ఓ సంస్థ నిర్వాకమిది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంస్థపై దాడి చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.

* మూడు దశాబ్దాల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తుక్కు చేసే ప్రక్రియను కొనసాగించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నౌక విచ్ఛిన్న ప్రక్రియను ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌ చాలా ఆలస్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే నౌకలోని 40శాతాన్ని నిర్వీర్యం చేసినందున, ఇప్పుడు విచ్ఛిన్న ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.