Politics

సాగర్ ఎన్నికల్లో మద్యం మటన్ పంపిణీ

సాగర్ ఎన్నికల్లో మద్యం మటన్ పంపిణీ

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి గురువారం తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు కాక పెంచాయి. ప్రచారాన్ని పతాక స్థాయిలో నిర్వహిస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని తెరాస, ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాలని కాంగ్రెస్‌ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అనూహ్య ఫలితం సాధించాలనే తపనతో భాజపా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే పనుల్లో వేగం పెంచాయి. పోలింగ్‌కు మరో నాలుగు రోజులుండగానే పలు మండలాల్లో రెండు ప్రధాన పార్టీలు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నాయి. మాడుగులపల్లి మండలం గజలాపురం, కొణతాలపల్లి, కన్నెకల్‌, గారుకుంటపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం ఉగాది సందర్భంగా ఓ ప్రధాన పార్టీ ఉదయం కిలో మటన్‌, మద్యం సీసాను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇది తెలిసి మరో రాజకీయ పార్టీ నాయకులు కిలో చికెన్‌ను పంపిణీ చేశారు. నిడమనూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఒక ప్రధాన పార్టీ పండగ ఖర్చులకు కుటుంబానికి రూ.500 ఇచ్చింది. ‘‘ఉప ఎన్నిక పుణ్యమా అని నెల రోజుల నుంచి తాగేవాళ్లకు మద్యానికి కొదవలేదు. ఈ ఏడాది ఉగాది పండగ ఒక్క పైసా ఖర్చు లేకుండా జరిగింద’’ని కన్నెకల్‌కు చెందిన యాదగిరి చెప్పారు.