Health

నాడీ పట్టుకుని చూశారా?

నాడీ పట్టుకుని చూశారా?

విశ్రాంతిగా కూచున్నారా? అయితే ఒకసారి మణికట్టు దగ్గర వేళ్లతో అదిమి నాడిని పరీక్షించుకోండి. ఇప్పుడెందుకని అనుకోకండి. విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని బట్టి మన ఆరోగ్యస్థితిని, మున్ముందు తలెత్తే సమస్యలను అంచనా వేయొచ్చు మరి. ఆరోగ్యస్థితిని అంచనా వేసే మార్గాల్లో నాడి చూసుకోవటం చాలా తేలికైంది. సమర్థవంతమైంది కూడా. కేవలం 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకునే వీలుంటుంది. మణికట్టు వద్ద బొటనవేలు కిందిభాగంలో గానీ మెడకు ఒక పక్కన గానీ రెండు వేళ్లతో ఒకింత గట్టిగా అదిమిపడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవటాన్ని గమనించొచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి, దాన్ని రెట్టింపు చేస్తే ఒక నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటివారికి గుండెపోటు వంటి జబ్బుల ముప్పు తక్కువ. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటున్నకొద్దీ గుండె సమస్యల ముప్పూ పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
**ఎన్నిసార్లు కొట్టుకోవాలి?
పెద్దవాళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణంగా నిమిషానికి 60-100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కానీ అంతకన్నా తక్కువగా.. 50-70 సార్లు కొట్టుకోవటమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగా గలవారిలో శారీరక సామర్థ్యం తక్కువగానూ.. రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టూ తేలింది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81-90 సార్లు నాడి కొట్టుకునేవారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతున్నట్టు బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువసార్లు గుండె కొట్టుకునేవారిలో ఈ ముప్పు మూడింతలు అధికంగా ఉంటుండటం గమనార్హం.
**వేర్వేరు సమయాల్లో..
గుండె వేగాన్ని ఒత్తిడి, ఆందోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతో పాటు రక్తపోటు, ఆందోళన తగ్గటానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించటానికి వారం మొత్తమ్మీద వేర్వేరు సమయాల్లో అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. చాలా సందర్భాల్లో 80 కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
**ఎప్పుడు చూసుకోవాలి?
శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే 1-2 గంటల తర్వాత.. కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలి. ఉదయం పూట నిద్ర లేచాక మంచం మీది నుంచి దిగకముందే గుండె వేగాన్ని పరీక్షించుకోవటం ఉత్తమం.
**కొలెస్ట్రాల్‌ అదుపుతో మేలు
కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, రక్త ప్రసారం తగ్గుతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుకోవటం, వ్యాయామం ద్వారా గుండె వేగం పెరగకుండా చూసుకోవచ్చు.