నగరానికి డబుల్ డెక్కర్ ప్రయాణం కలిసి రావడం లేదా! ఐదేళ్ల క్రితం నగర వాసులకు ఈ తరహా రైలు ప్రయాణం దూరమైంది. మరోవైపు సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని చేస్తున్న ప్రయత్నాలు.. ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారాయి. ఆరు నెలలైనా.. ప్రక్రియ టెండర్ దశ దాటలేదు. ప్రధాన మార్గాల్లో పైవంతెనలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఆటంకంగా మారగా.. నగర శివార్లలో తిప్పితే ఆశించిన ఫలితం ఉండదని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు ఒక్కో బస్సు మీద రూ.75 లక్షల వరకూ వెచ్చించడం సంస్థకు భారం కానుంది.
టెండరుకు స్పందన కరవు..: విశ్వనగరివైపు వడివడిగా అడుగులు వేస్తున్న నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు మరింత వన్నె తెస్తాయి! అందుకే 1990లలో నిలిచిపోయిన ఈ సర్వీసులను మళ్లీ తీసుకురావాలన్న పాలకుల సూచనల మేరకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. కానీ.. టెండర్ల దశలోనే ఎదురు దెబ్బ తగిలింది. మూడు సంస్థలు ఆసక్తి చూపించగా.. ప్రీ బిడ్డింగ్‌కు రెండే వచ్చాయి. టెండరు వేసింది మాత్రం ఒకే ఒక్క సంస్థ. ఒక్కరే టెండర్ వేస్తే సహజంగా రద్దు కావాలి. అయితే ఆ సంస్థకు అపార అనుభవం ఉండటంతో దరఖాస్తు పరిశీలించారు. వ్యయం ఎంతైనా సరే, బస్సులు సమకూర్చుకోవాలని ముందుకెళ్లినా.. వాటి తయారీ, పరీక్షలు, ఆ తర్వాత సంస్థకు అప్పజెప్పడానికి కనీసం 9 నెలలు పడుతుంది.