Devotional

తిరుమలలో వైభవంగా ఉగాది

Ugadi 2021 By TTD In Tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, శ్రీవారి మూలవిరాట్టుకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన శ్రీప్లవనామ సంవత్సర పంచాంగాన్ని శ్రవణం చేశారు. ప్లవనామ సంవత్సరంలో దేశకాల, రుతు పరిస్థితులు, నక్షత్ర, రాశి, వారాది ఫలితాలను తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఆలయంలో చేసిన ప్రత్యేక పుష్పాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఎనిమిది టన్నుల సంప్రదాయ పుష్పాలు, 70 వేల కట్ ఫ్లవ‌ర్స్‌ను వినియోగించారు. పండ్లు, కూరగాయలతో స్వామివారి ప్రతిరూపాలు, శంఖుచక్ర నామాలను రూపొందించారు.