జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు
కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సుఖసంతోషాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు. మనిషి వర్తమానంలో నిలిచినప్పుడు మనసు బానిసైపోతుంది. అంటే, మనిషి చెప్పినట్లు మనసు వింటుంది. అప్పుడు జీవితం వేడుక అవుతుంది. అలా కాకుండా భూత భవిష్యత్తుల మధ్య డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంటే మనిషిని కీలుబొమ్మగా చేసి ఇష్టానుసారం ఆడుకుంటుంది. దుఃఖసాగరంలో ముంచి ఆనందోత్సవం జరగకుండా చూస్తుంది.
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతంలో ఉన్నట్లు అస్సలు ఉండదు. అది నిత్యం మారిపోతూ కొత్తగా ఉంటుంది. సర్వమూ ఎరిగి, అంతటా వ్యాపితమైన చైతన్యశక్తి ఎత్తని రూపమంటూ ఉండదు. వర్తమానం అనేకానేక నూతనావిష్కరణల కర్మాగారం.
దారి దిక్కు తెలియక, ఎటువైపు వెళ్లాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నపుడు ఎదురైన బాటసారికి ఇదీ దారి అని చూపితే కలిగే ఆనందమే వేరు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే- ఆనందానికి జ్ఞానమే మూలం అని.నిజానికి జ్ఞానం, ఆనందం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకేదాన్ని సూచించే పర్యాయపదాలు.ఈ రెండింటితో ఆరోగ్యమూ సమకూరుతుంది. ఆరోగ్యవంతుడు మాత్రమే తన చేతిలోని పనిని సంపూర్ణంగా పూర్తిచేయగలడు. నూతన ఆలోచనలతో కొత్త వాటిని కనిపెట్టి ప్రపంచానికి కానుకలుగా సమర్పించగలడు.