Business

మహీంద్రా సరికొత్త కారు XUV700-వాణిజ్యం

మహీంద్రా సరికొత్త కారు XUV700-వాణిజ్యం

* కొవిడ్‌ నిరోధానికి మన దేశంలో ‘స్పుత్నిక్‌ వి’ టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ ఇచ్చింది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన ఈ టీకాపై మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి, ఆ సమాచారంతో అత్యవసర అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దీనికి సోమవారం ఆమోదం లభించింది. దీంతో కొవిడ్‌-19 వ్యాధికి మనదేశంలో మూడో టీకా అనుమతి పొందినట్లు అయ్యింది. ఇప్పటికే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ‘కొవిషీల్డ్‌’ టీకా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ‘కొవాగ్జిన్‌’ టీకాలను ప్రజలకు ఇస్తున్న సంగతి విదితమే. కొవిడ్‌-19 రెండోదశ ముప్పు తీవ్రమవ్వడం, దేశవ్యాప్తంగా టీకా కొరత ఏర్పడటం.. వంటి పరిణామాల నేపథ్యంలో, ‘స్పుత్నిక్‌ వి’ టీకాకు అనుమతి లభించటం గమనార్హం. మనదేశానికి ఈ టీకాను తీసుకురావడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, గత ఏడాది సెప్టెంబరులో ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను డాక్టర్‌ రెడ్డీస్‌ దేశీయంగా నిర్వహించింది. ‘స్పుత్నిక్‌ వి’ని పెద్దఎత్తున విదేశాలకు అందించేందుకు వీలుగా మనదేశానికి చెందిన పలు టీకా తయారీ సంస్థలతో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. హెటిరో డ్రగ్స్‌, గ్లాండ్‌ ఫార్మా, స్టెలిస్‌ బయో ఫార్మా, విర్కో బయోటెక్‌, పానేషియా బయోటెక్‌తో ఈ తయారీ ఒప్పందాలు కుదిరాయి.

* దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎక్స్‌యూవీ700గా వ్యవహరిస్తున్న కారును ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ సరికొత్త డబ్ల్యూ601 ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేశారు. దీనిని ప్రస్తుతం ఉన్న ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 500తో భర్తీ చేస్తారని భావిస్తున్నారు. దీనిపై మహీంద్రా ప్రతినిధి స్పందిస్తూ ‘‘మేము ఎక్స్‌యూవీ 700ను విడుదల చేశాక.. ఎక్స్‌యూవీ 500 తయారీ నిలిపివేస్తాం’ అని పేర్కొన్నట్లు ఎన్‌డీటీవీ వెల్లడించింది. మహీంద్రా ఎక్స్‌యూ 500 బ్రాండ్‌ను పూర్తిగా నిలిపివేసే అవకాశాలు లేకపోవచ్చు. భవిష్యత్తులో వచ్చే కార్లకు దీనిని వాడవచ్చు.

* భార‌త్‌లో లాక్‌డౌన్లు వారానికి 1.25 బిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కోత‌కు గురి చేస్తాయి. జీడిపీ నుండి 140 బీపీఎస్‌ల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఒక నివేదిక పేర్కొంది. ప్ర‌స్తుత అంక్ష‌లు మే చివ‌రి వ‌ర‌కు అమ‌లులో ఉంటే ఆర్థిక‌, వాణిజ్య కార్య‌క‌లాపాల న‌ష్టాలు సుమారు 10.5 బిలియ‌న్ డాల‌ర్లు లేదా జీడిపీలో 34 బీపీఎస్ ఉంటుంద‌ని బ్రిటీష్ బ్రోక‌రేజ్ బార్క్లేస్ తెలిపారు.

* సోలీస్‌ యాన్మార్‌ రేంజస్‌ పరిధిలోని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌) భారత్‌లో సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. సోలీస్‌ హైబ్రీడ్‌5015 పేరుతో ట్రాక్టర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.7.21లక్షలుగా నిర్ణయించింది. దీంతో భారత్‌కు ఈ పవర్‌ బూస్ట్‌ టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఐటీఎల్‌కు దక్కింది. ఈ టెక్నాలజీకి సంబంధించిన పలు పేటెంట్లు సంస్థ పేరిట ఉన్నాయి. భారత్‌లో 4వీల్‌ డ్రైవ్‌లో సోలీస్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైబ్రీడ్‌ 5015 ట్రాక్టర్‌ ఉపయోగపడుతుంది.

* భారత్‌కు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ను తమ సస్టెయినబిలిటీ సూచీ నుంచి తొలగించినట్లు ఎస్‌ అండ్‌ పీ డోజోన్స్‌ ఇండిసెస్‌ తెలిపింది. ఏప్రిల్‌ 15న మార్కెట్‌ ప్రారంభం కావడానికి ముందే ఈ మార్పు అమల్లోకి వస్తుందని వివరించింది. ఈ కంపెనీ వ్యాపారాలకు మియన్మార్‌ మిలటరీతో సంబంధం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యాంగాన్‌లో మిలటరీకి చెందిన మియన్మార్‌ ఎకనమిక్‌ కార్పొరేషన్‌(ఎమ్‌ఈసీ) నుంచి లీజుకు తీసుకున్న భూమిలో ఏపీఎస్‌ఈజడ్‌ 290 మిలియన్‌ డాలర్లతో నౌకాశ్రయం నిర్మిస్తోంది. భూమి లీజు ఫీజు కింద కంపెనీ 30 మిలియన్‌ డాలర్లు చెల్లించిందన్న వార్తలూ వచ్చాయి. అదానీ పోర్ట్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరన్‌ అదానీ జులై 2019 నాటి సమావేశంలో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఆర్మీ చీఫ్‌, సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లాయింగ్‌ను కలిశారని ఏబీసీ న్యూస్‌ తెలిపింది.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో స‌హా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 5-10 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాల‌ప‌రిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు గ‌రిష్టంగా 6.2% వ‌డ్డీని అందిస్తున్నాయి. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి మ‌ధ్య బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. ఈ వ‌డ్డీ రేటు ప‌రిస్థితుల్లో స్థిరంగా రెగ్యుల‌ర్ ఆదాయం కొసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్కువ‌గా దెబ్బ‌తిన్నారు. అయితే బ్యాంక్‌ల క‌న్నా పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ప‌థ‌కాలు అధిక వ‌డ్డీ రేటును అందిస్తాయి. సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుకు హామినిచ్చే కొన్ని పెట్టుబ‌డి ప‌థ‌కాలు.

* హైదరాబాద్‌లో నూతన ‘యాక్సెలరేటర్‌’ సెంటర్‌ను పీడబ్ల్యూసీ ప్రారంభించింది. అత్యంత అధిక నైపుణ్యాల గల మానవ వనరుల కేంద్రాలుగా వీటిని పీడబ్ల్యూసీ భావిస్తుంది. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను బహుముఖంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు పీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పీడబ్ల్యూసీ కార్యకలాపాలకు ఈ కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తుందని పీడబ్ల్యూసీ యాక్సెలరేటర్‌ సెంటర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ హరి కుమార్‌ వివరించారు.

* కేంద్రం, రాష్ట్రాలు, వాటి పన్ను విభాగాలకు ఖాయిలా పడ్డ సంస్థలు ఏవైనా బకాయిలు (చట్టబద్ధ చెల్లింపులు సహా) ఉంటే వాటిని చెల్లించనక్కర్లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయా బకాయిలు దివాలా స్మృతి(ఐబీసీ) కింద లభించిన పరిష్కార ప్రణాళికలో భాగం కాకుండా ఉండాలని తెలిపింది. ‘ఐబీసీ ప్రధాన లక్ష్యం ఏమిటంటే కార్పొరేట్‌ బకాయిదారును పునరుజ్జీవం చేయడం. అయితే పన్ను, ఇతర విభాగాలు అందుకు భిన్నంగా చేస్తున్నా’రని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన పలు ఆదేశాలపై వచ్చిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హృశీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించి, ఐబీసీలోని సవరణను సమర్థించింది. 2019లో ఐబీసీలోని సెక్షన్‌ 31లో చేసిన సవరణ ప్రకారం.. కేంద్రం లేదా రాష్ట్రం లేదా స్థానిక ప్రభుత్వాలకు ఏ చట్టం కిందైనా చెల్లించాల్సిన బకాయిలు అనుమతి పొందిన పరిష్కార ప్రణాళికలో భాగంగా లేకపోతే.. అవి ‘నిర్మూలన’కు గురైనట్లుగానే భావించాలి.