బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ‘అపరిచితుడు’ రీమేక్ చేస్తున్నట్లు డైరెక్టర్ శంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళంలో ‘అన్నియన్’ పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా అది బాగా అలరించింది. దీంతో ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘అన్నియన్’ సినిమాపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయంటూ, హిందీలో రీమేక్ ఆలోచన విరమించుకోవాలని నిర్మాత రవిచంద్రన్ ఆరోపించారు. దానిపై డైరెక్టర్ శంకర్ కూడా స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరేలా కనిపిస్తోంది. ఈ మేరకు తొలుత నిర్మాత రవిచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘‘శంకర్.. ‘అన్నియన్’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నావని తెలిసి షాక్‌కు గురయ్యాను. ఆ చిత్రాన్ని నిర్మించే సమయంలోనే నేను దాని హక్కులను కొనుగోలు చేశాననే సంగతి నీకు తెలుసు. కాబట్టి ఆ కథపై పూర్తి హక్కులు నాకే ఉన్నాయి. నా అనుమతి తీసుకోకుండా నువ్వు ఆ సినిమా రీమేక్ ప్రకటించడం పూర్తిగా అన్యాయం.
‘బాయ్స్’ సినిమా విఫలమైనప్పుడు అవకాశాలు లేక నువ్వు ఎంత ఒత్తిడికి లోనయ్యావో గుర్తుతెచ్చుకో. ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా ఉన్న నీకు అప్పట్లో ‘అన్నియన్’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాను. కేవలం నా మద్దతు వల్లే నువ్వు తిరిగి ఫామ్‌లోకి వచ్చావు. ఇప్పుడు నాకే మాత్రం సమాచారం ఇవ్వకుండా ఆ సినిమాకి రీమేక్ తీస్తున్నావ్. హిందీ రీమేక్‌ను వెంటనే నిలిపివేయాలి’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. దానికి బదులుగా శంకర్ మరో లేఖ విడుదల చేశారు. ‘‘సినిమా కథపై పూర్తి హక్కులు మీకు ఉన్నాయని అనడం నన్ను విస్మయానికి గురిచేసింది. ‘అన్నియన్’ చిత్రానికి సంబంధించి స్క్రిప్టుపై పూర్తి హక్కులు నావే. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ నా పేరుతోనే సినిమా విడుదలైంది. పైగా.. మీకు కథ హక్కులు అమ్ముతున్నట్లు నేను ఎలాంటి పత్రం రాసి ఇవ్వలేదు. నేను రాసిన కథలో ఎవరి పాత్రా లేదు. ఇది కేవలం దురుద్దేశంతో.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు’ అంటూ శంకర్ బదులిచ్చారు.