తానా 2021 ఎన్నికల్లో ప్రత్యర్థులు గతచరిత్ర తవ్వకాల మీద పడ్డారు. తాజాగా SAVETANA పేరిట గురువారం నాడు తానా సభ్యులకు వచ్చిన ఈమెయిళ్లు ప్రకంపనలు సృష్టించాయి. ప్రస్తుతం తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డా.నరేన్ కొడాలి 2018లో తాగి కారు నడిపి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారని, ఎన్నికల ఉపన్యాసాల్లో క్రమశిక్షణ, నిబద్ధత వంటి పదాలతో మైమరిపించే ప్రసంగాలు చేసే ఆయన నిజజీవితంలో మాత్రం తాగి బాధ్యతరాహిత్యంగా ప్రవరిస్తుంటారని ఆ ఈ-మెయిల్ సారాంశం. ఈ మేరకు ఒక వీడియోను సైతం ఆ సందేశానికి జతచేశారు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ పోలీసు రికార్డులకు సంబంధించిన వివరాలను కూడా అందులో పొందుపరిచారు.
అయితే ఈ ఆరోపణలను నరేన్ కొట్టిపారేశారు. ఉదయం 9:30గంటలకు తాను తాగి పోలీసులకు దొరికిపోయాననేది అవాస్తవమని ఆ సమయం కోర్టులో విచారణ సమయమని పోలీసులు కేసు నమోదు చేసిన సమయం కాదని వివరణ ఇచ్చారు. రెండోది ఈ కేసులో తాను నిరపరాధినని కోర్టు తీర్పు వెలువరించిందని, ఔషధాలు తీసుకోవడం కారణంగా తన బ్లడ్ ఆల్కహాల్(BAC) పెరుగుదల కారణంగా కేసు నమోదు చేయగా కోర్టు నిజానిజాలను ధృవీకరించి కేసును కొట్టేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాను తన ప్యానెల్ సభ్యులు ఈ ఎన్నికల్లో కేవలం ఆశావహ దృక్పథంతో పనిచేయడంపైనే దృష్టి పెట్టామని, కానీ వాస్తవదూరంగా ఉండే ఇలాంటి నిరాధార ఆరోపణల వలన తమ ఏకాగ్రతను, విజయావకాశాలను దెబ్బతీయలేరని దీనికి రానున్న ఎన్నికల్లో ప్రవాసులే తమ ఓట్లతో సమాధానం చెప్తారని ఫేస్‌బుక్ వేదికగా పేర్కొన్నారు.
###############