* ప్రముఖ వైద్యులు, ఎన్నారై, ‘తానా’ వ్యవస్థాపక అధ్యక్షులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురై కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సుబ్బారావు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1986లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు ఇచ్చిన పిలుపు మేరకు కాకర్ల సుబ్బారావు స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టి, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా కృషి చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) తొలి అధ్యక్షుడిగా సేవలందించిన సుబ్బారావుతో చాలామంది ఎన్నారైలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే సుబ్బారావు మృతిపట్ల “తానా” కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు, సహ వ్యవస్థాపకులు గుత్తికొండ రవీంద్రనాధ్, ముక్కామల అప్పారావు, యడ్ల హేమ ప్రసాద్, మూల్పూరి వెంకటరావు తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. సుబ్బారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
* ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవానిరతి, అంకితభావం వైద్యులకు ఆదర్శనీయమని చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈమేరకు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. ‘ప్రముఖ వైద్యులు డా. కాకర్ల సుబ్బారావు గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. సేవానిరతితో వృత్తికే జీవితాన్ని అంకితం చేసిన ఆయన, వైద్యులందరికీ ఆదర్శప్రాయులు. రేడియాలజిస్టుగా, ఉస్మానియా వైద్యకళాశాల అధ్యాపకుడిగా, నిమ్స్ ఆసుపత్రి సంచాలకులుగా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వారు విశేష కృషి చేశారు. డా. కాకర్ల సుబ్బారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.