ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా వుందని, ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది కొవిడ్ టీకా వేయించుకోవడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని వివరించారు. ఇదిలా వుండగా కొవిడ్ టీకా వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ సమక్షంలో వివేక్ గురువారం కరోనా టీకా వేయించుకున్నారు. అంతేగాక ఆయన్ని ప్రజారోగ్య అవగాహనా కార్యక్రమాల బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా మహమ్మారిని ఈ ప్రపంచం నుంచి తరిమికొట్టాలంటూ ఈ సందర్భంగా వివేక్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివేక్ స్థానిక సాలిగ్రామంలోని తన ఇంట్లో శ్వాస ఆడడంలేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు.
కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చగా అప్పటికే పరిస్థితి విషమించినట్లు వైద్యులు గుర్తించారు. 59 సంవత్సరాల ఈ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత .. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే అవగాహనా కార్యక్రమాలకు తన వంతు సాయం అందిస్తుంటారు. అగ్ర హీరోలైన రజనీ, కమల్, సూర్య, విక్రమ్, విజయ్, అజిత్ తదితర హీరోల చిత్రాల్లో నటించారు. వృక్షాల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ సంరక్షణకు మద్దతుగా ఆయన పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, గతంలో వివేక్ కుమారుడు డెంగీ జ్వరం కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే.