సూపర్‌మార్కెట్‌కి వెళ్తే పోషకాలతో నిండిన కొత్త కొత్త విదేశీ కూరగాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా ధర ఎక్కువనో, వండటం తెలియకనో చాలామంది వాటిని కొనడానికి వెనుకాడుతుంటారు. అందుకే అవి రైతుబజార్లలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ కోవకే చెందుతుంది బ్రకలీ. ఇప్పుడు ఇది మనదగ్గరా విరివిగా పండుతూ అన్ని మార్కెట్లలోనూ కనిపిస్తోంది.
****‘బ్రకలీ ఈజ్ మై ఫేవరెట్’ అని అమెరికా మాజీ అధ్యక్షులైన జెఫర్సన్, ఒబామాలు చెబితే, ‘అదంటే నాకస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు మా అమ్మ బలవంతంగా తినిపించేది, పెద్దయ్యాక పూర్తిగా మానేశాను’ అని ఓ సభలో జార్జి బుష్ చెప్పాడట. అది విన్న రైతులు కావాలని వైట్‌హౌస్‌కి ఏకంగా పది టన్నుల బ్రకలీ పంపించారట. ఇష్టాయిష్టాలనూ చిరుచేదుగా ఉండే దాని రుచినీ పక్కనపెడితే, బ్రకలీ… క్యాన్సర్ నివారిణి. అందుకే కష్టంగానైనా అందరూ దాన్ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, కేల్, బ్రకలీ… బ్రసికేసి కుటుంబానికి చెందిన ఈ కూరగాయలన్నీ క్యాన్సర్‌ని అడ్డుకుంటాయని ఇప్పటికే పరిశోధనలు చెబుతున్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే విటమిన్లూ ఖనిజాలూ పీచూ ఫ్యాటీ ఆమ్లాలూ యాంటీ ఆక్సిడెంట్ల శాతం బ్రకలీలో ఇంకాస్త ఎక్కువ.
**ఏమున్నాయిందులో..?
బ్రకలీలో కె, సి, ఎ విటమిన్లూ; పీచు, కాల్షియం, పొటాషియం, ఐరన్… వంటి ఖనిజాలూ; గ్లూకోసైనొలేట్లూ ఐసోథియోసైనేట్లూ సల్ఫొరాఫేన్ల వంటి యాంటీఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఉడికించినప్పుడు- ఆ నీళ్లను పారబోయకుండా సూప్‌లా చేసుకుంటే అందులోని గ్లూకోసైనోలేట్లు పోకుండా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌ని పెరగకుండా చేయడంతో దీన్ని కొందరు గ్రీన్ కీమోప్రివెన్షన్ అనీ పిలుస్తారు. ఇందులోని కాల్షియం, విటమిన్-సి రెండూ కలిసి ఎముకలు, దంత ఆరోగ్యంలో కీలకమైన కొలాజెన్ తయారీకి తోడ్పడతాయి. పేగు, కొలొరెక్టల్ క్యాన్సర్లు రాకుండానూ కొలెస్ట్రాల్ పెరగకుండానూ పీచు అడ్డుకుంటుంది. హృద్రోగాలూ మధుమేహ వ్యాధులకు దారితీసే ఇన్ఫ్లమేష్నీ ఇది నివారిస్తుంది.
కణాల్లో నిరంతరం జరిగే ఆక్సీకరణ ప్రక్రియను తగ్గించడం వల్ల వయసుమీద పడకుండా చేస్తుంది బ్రకలీ. ఇందులోని క్యాంఫెరాల్, గ్లూకోబ్రసికిన్, సల్ఫొరాఫేన్లు మెదడులో ఆక్సీకరణ ప్రక్రియను తగ్గించడం ద్వారా వాటి పనితీరుని మెరుగుచేస్తాయి. ప్రమాదరీత్యా దెబ్బతిన్న మెదడు కణజాలం త్వరగా కోలుకునేందుకూ బ్రకలీ తోడ్పడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గర్భిణులకు అవసరమైన ఫొలేట్ కూడా ఇందులో ఎక్కువే. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడే శక్తి కూడా దీనికి ఉంది. ఊబకాయంతో బాధపడే మధుమేహులకి 12 వారాలపాటు బ్రకలీ ఎక్స్ట్రాక్ట్ను ఇవ్వడం వల్ల వాళ్లలో ఊబకాయంతో పాటు మధుమేహం కూడా తగ్గిందట. ఆటిజంతో బాధపడే పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. బ్రకలీలోని గ్లూకొరాఫానిన్, గ్లూకోనాస్టర్టిన్, గ్లూకోబ్రసిసిస్ అనే మూడు పదార్థాలూ కలిసి శరీరంలోని టాక్సిన్లనూ నియంత్రిస్తాయి.
**ఎన్ని రకాలున్నాయి?
ముదురాకుపచ్చరంగులో ఉండే బ్రకలీ కాలాబ్రెసి, ఒకే పువ్వులా కాకుండా విడివిడి రెమ్మల్లా ఉండే స్ప్రౌటింగ్ బ్రకలీ, ఆకులెక్కువా పువ్వు తక్కువా ఉండే చైనీస్ బ్రకలీ, కాలీఫ్లవర్‌లా కనిపించే పర్పుల్ బ్రకలీ, బేబీ బ్రకలీగా పిలిచే బ్రకలిని… ఇలా బ్రకలీలో చాలానే రకాలున్నాయి. ఊదారంగు బ్రకలీ చూడ్డానికి కాలీఫ్లవర్‌లా ఉంటుంది కానీ పువ్వులోని పూమొగ్గలు చిన్నగా ఉంటాయి. ఇందులో ఎరుపూ ఆకుపచ్చా తెలుపూ రంగులూ ఉంటాయి. సంప్రదాయ బ్రకలీ, చైనా బ్రకలీల మిశ్రమమైన బేబీ బ్రకలీలో పోషకాల శాతం ఎక్కువ. అందుకే దీన్ని సూపర్ బ్రకలీ అంటారు. ఇక బ్రకలీ, కాలీఫ్లవర్లని సంకరీకరించిన రోమనెస్కూ కూడా రుచిగానే ఉంటుందట. కాబట్టి బ్రకలీలో రకాలన్నింటినీ హాయిగా తినొచ్చన్నమాట.
బ్రకోలితో అంతా మంచి…
Related tags :