* దేశవ్యాప్తంగా 77,954 కార్లను హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) వెనక్కి పిలిపించనుంది. లోపాలున్న ఇంధన పంపులను సరిచేయడంలో భాగంగా ఈ రీకాల్ చేపట్టింది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు మధ్య తయారైన అమేజ్, 4వ తరం సిటీ, డబ్ల్యూఆర్-వి, జాజ్, సివిక్, బీఆర్-వి, సీఆర్‌వీ మోడళ్లపై ఈ రీకాల్ ప్రభావం పడనుంది. ఈ కార్లలోని ఇంధన పంపుల్లో లోపాలున్న ఇంపెలర్ల వల్ల ఇంజిన్ ఆగిపోవడం, ప్రారంభం కాకపోవడం జరగొచ్చని హోండా కార్స్ తెలిపింది. 2019 జనవరి- ఆగస్టు మధ్య ఉత్పత్తి చేసిన 36,086 అమేజ్ కార్లు, 2019 జవనరి- సెప్టెంబరు మధ్య తయారైన 20,248 నాలుగో తరం సిటీ కార్లు, 2019 జనవరి- సెప్టెంబరు మధ్య తీసుకొచ్చిన 5170 సివిక్ కార్లు, 2019 జనవరి- అక్టోబరు మధ్య తయారైన 1737 బీఆర్-విలు, 2019 జనవరి- 2020 సెప్టెంబరు మధ్య విడుదలైన 607 సీఆర్‌వీ కార్లకు ఈ రీకాల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. నేటి నుంచి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌సీఐఎల్ డీలర్ల వద్ద లోపాలను ఉచితంగా గుర్తించి, కొత్త పరికరంతో భర్తీ చేస్తామని తెలిపింది. దీని కోసం వినియోగదారులను కంపెనీ నేరుగా సంప్రదిస్తుందని కంపెనీ వెల్లడించింది.
* మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ మెరుగైన ఫలితాల్ని సాధించింది. స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికరలాభం 18 శాతం పెరిగి రూ.8,186 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ.6,927.6 కోట్లుగా ఉంది. అయితే, క్రితం త్రైమాసికంతో పోలిస్తే స్టాండ్‌ఎలోన్ నికర లాభంలో 6.5 శాతం క్షీణత కనిపించింది.
* ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్స్ ఐపీఓకు రాబోతోంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం రూ.1,160 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు ప్రమోటర్లకు చెందిన 73.05 లక్షల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. గ్లెన్‌మార్క్ ప్రమోటర్లుగా ఉన్న సల్దన్హా ఫ్యామిలీ ట్రస్ట్, ఎలిజెబెత్ సల్దన్హా, గ్లెన్ సల్దన్హా, చెరిలన్ పింటో తమ వాటాల్లోకి కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి, లాట్ సైజ్, సబ్‌స్క్రిప్షన్ తేదీ వంటి వివరాల్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. అయితే, మొత్తం రూ.2000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
* ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక కాంట్రాక్టు అప్పగించింది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. 2024 నాటికి చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన ల్యాండర్‌ను స్పేస్‌ఎక్స్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అమెజాన్ సహవ్యవస్థాకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్, డైనెటిక్స్ కూడా పోటీ పడగా.. నాసా స్పేస్‌ఎక్స్ వైపే మొగ్గుచూపింది.