Business

బంగారం భారీగా దిగుమతి-వాణిజ్యం

Business News - Gold Imports Increased By 22.58 Percent In India

* కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 22.58 శాతం పెరిగి 34.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.2.54 లక్షల కోట్లు)కు చేరాయి. దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. అదే సమయంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు పెరిగినప్పటికీ.. 2019-20లో 161.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2020-21లో 98.56 బిలియన్‌ డాలర్లకు తగ్గడం గమనార్హం. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

* ఆసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలో మనుగడ సాధించేందుకు విదేశీ బ్యాంకులు సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. రూ.వందల కోట్లలో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ.. వ్యాపారపరంగా దూసుకెళ్లలేకపోతున్నాయి. ఈ రెండు దేశాల్లోని రిటైల్‌ వ్యాపారాల నుంచి నిష్క్రమించనున్నట్లు అమెరికా సంస్థ సిటీ గ్రూపు ప్రకటించడమే తాజా ఉదాహరణ. దేశీయ రుణ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వినియోగ ఆధారిత రుణాలు (కన్జూమర్‌ ఫైనాన్స్‌), నైపుణ్యవంతులైన ఉన్నతాధికారుల విషయంలో విదేశీ సంస్థలకు దేశీయ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని చెబుతున్నారు. అధిక మూలధనం, నియంత్రణపరమైన సవాళ్లు లాంటివి ఇతర కారణాలుగా పేర్కొంటున్నారు.

* అంత‌ర్జాతీయంగా ఆటోమొబైల్ రంగం కుదేలైంద‌ని గ‌ణాంకాలే చెబుతున్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో విదేశాల‌కు వాహ‌నాల ఎగుమ‌తులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.

* టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పరిస్థితులు సహకరించని కారణంగా సమయం, తేదీ మార్చుకుంటే అందుకు విమానయాన సంస్థలు అదనపు మొత్తాన్ని వసూలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. మే 15వ తేదీ వరకూ బుక్‌ చేసుకున్న టికెట్లకు సంబంధించి సమయం, తేదీ మార్పులు చేసుకునే ప్రయాణీకులపై ఎలాంటి రుసుములు విధించమని ఎయిర్‌ ఏషియా తెలిపింది.