ప్రస్తుత తానా ఎన్నికల్లో ఇరు ప్యానెళ్ల అభ్యర్థులను బేరీజు వేసుకుని నిస్వార్థంగా దీర్ఘ కాలం సేవ చేసే ఉద్దేశం ఉన్నవారిని స్వతంత్ర ఆలోచనతో స్వీయ విజ్ఞతతో ఎన్నుకుని పట్టం కట్టవల్సిందిగా తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డా.కొడాలి నరేన్ కోరారు. సొంత ఊరు వర్జీనియాలో ఆదివారం మధ్యాహ్నం స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఓటు వేసే ముందు ఒక్క నిముషం ఆలోచించాలని, ఇరు ప్యానెళ్ల అభ్యర్థులను బేరీజు వేసుకుంటే తమ ప్యానెల్‌కు అత్యధిక మార్కులు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించవల్సిందిగా ఆయన కోరారు. సంస్థకు సేవ చేసే సదవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. DMV ప్రాంతానికి చెందిన మూల్పూరి వెంకటరావు, యడ్ల హేమప్రసాద్, జక్కంపూడి సుబ్బారాయుడులు తనకు ప్రేరణ అని నరేన్ పేర్కొన్నారు. సంస్థకు చేటు చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అంటే తల్లిదండ్రులను అగౌరవపరిచినట్లేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన మిత్రులు, కుటుంబసభ్యుల సహకారంతో తాను గెలుస్తానని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. 400మంది కార్యకర్తలు, 8నెలలు కష్టపడి డీసీ సభలు విజయవంతంగా నిర్వహిస్తే దానిపై విమర్శలు గుప్పించడం బాధ కలిగించందని, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరిన వారిలో తాను ప్రథముడినని నరేన్ పేర్కొన్నారు.
*** పొట్లూరి రవికి ప్రత్యేక ధన్యవాదాలు
తనతో పాటు ఈసారి అధ్యక్ష పదవిని ఆశించిన పొట్లూరి రవిని తాను సంప్రదించి తన ఆలోచన వివరించగానే సహృదయంతో ఆయన పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని భావించి అధ్యక్ష అభ్యర్థిత్వం నుండి తప్పుకోవడం తానా పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని, ఇందుకు ఆయనకు నరేన్ ధన్యవాదాలు తెలిపారు.