DailyDose

గుంటూరులో పట్టపగలు ₹9లక్షలు చోరీ-నేరవార్తలు

గుంటూరులో పట్టపగలు ₹9లక్షలు చోరీ-నేరవార్తలు

* నడిరోడ్డుపై, పట్టపగలే లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.9 లక్షలు డ్రాచేసి డబ్బు సంచిని ద్విచక్రవాహనం డిక్కీలో ఉంచాడు. స్థానికంగా టిఫిన్‌ చేసిన అనంతరం తన దుకాణానికి వెళ్లి బైక్‌లో డబ్బు కోసం చూడగా కనిపించలేదు. చోరీకి గురైందని గమనించి లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.

* విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని జుత్తాడలో జరిగిన హత్యల ఘటనలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. హత్యలు చేసింది ఒక్కడే కాదని.. దీని వెనుక ఇంకా ఆరుగురు ఉన్నారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు అప్పలరాజుతో సహా మిగతా వారినీ చంపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

* హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. అతివేగంతో ఎదురుగా వచ్చిన ఓ కారు ఇటుక లారీ కిందకు దూసుకెళ్లడంతో అది బోల్తా పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భూదాన్(25) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

* రైలు పట్టాల వద్ద ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోనకల్లు సమీపంలోని రైలు పట్టాల వద్ద పడి ఉన్న రెండు మృతదేహాలను ఈ ఉదయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతులను కృష్ణా జిల్లా వత్తవాయి మండలం వేములనర్వ గ్రామానికి చెందిన శివ(18), తిరుపతిరావు(32)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీరివురు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి చనిపోయారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.