Politics

మన్మోహన్‌కు కరోనా-తాజావార్తలు

మన్మోహన్‌కు కరోనా-తాజావార్తలు

* రష్యా అధ్యక్షుడికి బద్ధవిరోధి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీని ఆసుపత్రికి తరలిస్తామని ఆ దేశ జైళ్ల శాఖ వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ క్లిష్టంగానే ఉంది. ఖైదీలకు చికిత్స చేసే ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. మాస్కో బయట జైలులో ఉన్న ఆయన మూడు వారాల క్రితం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ‘‘నవాల్నీని ఖైదీలకు చికిత్స అందించే కాలనీనెంబర్‌ 3లోని వైద్యశాలకు తరలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే ఉంది. ఆయన్ను వైద్యులు నిత్యం పరీక్షిస్తున్నారు’’ అని జైళ్ల శాఖ వైద్య బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

* గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 13.56 లక్షల పరీక్షలు చేయగా 2,73,810 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.దీంతో దేశంలో వరుసగా ఐదో రోజూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో మన్మోహన్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.

* గుంటూరు జిల్లా మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు –కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా 15 రోజులు ఆంక్షలు అమలు – నేటి నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు మూసివేత – ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 వరకే దుకాణాలు – ఇంటింటా సమాచారం సేకరించాలని అధికారుల నిర్ణయం.

* సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన తన స్వగ్రామం సైఫాయిలో ఓటు వేసేందుకు వెళ్లలేదు. 81 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడం తప్పలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ములాయం సింగ్‌ను ఈసారి ఓటు వేసేందుకు రావొద్దని తామే కోరామని, అదృష్టవశాత్తు ఆయన అంగీకరించారని ములాయం బంధువు ధర్మేంద్ర యాదవ్‌ తెలిపారు. యూపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ సోమవారం జరిగింది.

* ప్రస్తుతం వైరస్‌లో వచ్చిన మార్పుల కారణంగా అది బలవంతంగా గడియ తీసి.. తలుపులు తెరుచుకొని ఇంట్లోకి చొరబడినట్లుగా మానవ కణజాలంలోకి ప్రవేశిస్తోందని ప్రముఖ ప్రజారోగ్య నిపుణుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది కళ్లలోంచీ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నందున అందరూ పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు ధరించడం మంచిదని సూచించారు. వైరస్‌ ఏవైనా వస్తువులు, సామగ్రి ఉపరితలాల మీద పడి వాటిని ముట్టుకోవడం ద్వారా కంటే రోగుల నుంచి వెలువడే సూక్ష్మ తుంపర్ల ద్వారా (గాలిలో ప్రయాణించి) ఇతరులకు వ్యాపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో జనవరి నుంచి ప్రజల్లో పెరిగిన ఉదాసీనత వల్లే మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని అడ్డుకోవాలంటే అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలో కొవిడ్‌ రెండో దశ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

* దేశరాజధానిలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉండనుంది. ఈ మేరకు కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. అంతకుముందు లాక్‌డౌన్‌పై కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సమావేశమై చర్చించారు.

* విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా ఉద్ధృతిపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇళ్లల్లో జరిగే సామూహిక కార్యక్రమాలపై కనీసం రెండు నెలలపాటు పూర్తిగా నిషేధం విధిస్తేనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందని ఆ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక స్పష్టం చేసింది.

* పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్‌ అంచనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన డ్యామ్‌ అంచనా వ్యయం రూ.7,192 కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. గతంలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.5,535 కోట్లుగా జలవనరుల శాఖ నిర్ధారించగా.. స్పిల్‌ వే, ఈసీఆర్ఎఫ్‌, స్పిల్‌, పైలట్‌ ఛానల్‌ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ.1600 కోట్ల మేర పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.

* రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో పునరుద్ధరించిన కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఛైర్మన్‌గా తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. తక్షణమే కొవిడ్‌ కంట్రోల్‌ విధుల్లో చేరాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన జవహర్‌రెడ్డి.. ఆ తర్వాత తితిదే ఈవోగా బదిలీ అయ్యారు.

* ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పదవిపై తన సతీమణికి ఆసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచార హోరుకు ఆయన ఇవాళ శ్రీకారం చుట్టారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండున్నరేళ్లలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై ఆయన కరపత్రం విడుదల చేశారు. విపక్షాలు ఆరోపణలు తప్ప అభివృద్ధి చేయలేవన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాము సీపీఐతో కలిసి పోటీ చేస్తున్నామన్న మంత్రి.. అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని తెలిపారు.

* కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ నగరంలో శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టింది. రద్దీ రహదారుల వెంట డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లుతున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్‌ గాల్లో కూడా వ్యాపిస్తున్నట్టు తేలడంతో రద్దీ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమం చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులతో రద్దీగా మారుతున్నాయి.

* కరోనా పట్ల సీఎం జగన్‌ అలసత్వం ప్రదర్శించడం వల్లే ఏపీలో కొవిడ్‌ విలయతాండవం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడకుండా వారు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రణాళికాలోపం, అవగాహనా రాహిత్యంతోనే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం బయటకు రాకపోగా ఉద్యోగుల రక్షణకు ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలంటూ బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఉప ఎన్నికలో వైకాపా దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అని వైకాపాకు సవాల్‌ విసిరారు. ‘‘ దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని వైకాపా నేతలు వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా?దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. తిరుపతి ఉప ఎన్నికలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు పడ్డాయి’’ అని అచ్చెన్న అన్నారు.