దేశంలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడినప్పటికీ కొత్త రూపంలో చోటుచేసుకుంటున్న మోసాలు ఖాతాదారులను నిలువునా ముంచేస్తున్నాయి. ప్రజలు తమ మొబైల్ నుంచి వేర్వేరు యాప్‌ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో రిజర్వు బ్యాంకు సహా అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు డిజిటల్ మోసాలపై హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉంచొద్దని సూచించింది. బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతుండటంతో స్మార్ట్‌ఫోన్లలో బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారం, వాటి పాస్‌వార్డ్‌లు, సీవీవీ నంబర్ సహా కీలక సమాచారాన్ని దాచి ఉంచితే మోసాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని హెచ్చరించింది. అందువల్ల బ్యాంకింగ్ సంబంధిత కీలక సమాచారాన్ని తక్షణమే ఫోన్‌లో నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
ఖాతాదారులకు SBI హెచ్చరిక
Related tags :